విద్యార్థులకు BRAOU శుభవార్త.. M.Ed, MSW, B.Ed సహా 5 కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్!
BRAOU, BRAOU New Courses: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)లో M.Ed, M.Ed స్పెషల్ ఎడ్యుకేషన్, MSW, MSc Geography, B.Ed (Special Education) సహా ఐదు కొత్త కోర్సులు ప్రారంభం కానున్నాయి. యూజీసీ ఆమోదం లభించగా, అడ్మిషన్లు, అర్హతలు, ఫీజు వివరాలను త్వరలో యూనివర్సిటీ ప్రకటించనుంది.

హైదరాబాద్: ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కొత్త కోర్సులను ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. కొత్త కోర్సులకు సంబంధించిన ప్రతిపాదనలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో త్వరలోనే ఈ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.
ప్రారంభం కానున్న కొత్త కోర్సులు
- ఎం.ఎడ్. (M.Ed.)
- ఎం.ఎడ్. స్పెషల్ ఎడ్యుకేషన్
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW)
- ఎంఎస్సీ జాగ్రఫీ
- బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్)
విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి?
ఈ కోర్సులు ముఖ్యంగా విద్యారంగం, సామాజిక సేవ, ప్రత్యేక విద్య వంటి విభాగాల్లో కెరీర్ నిర్మించాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.
అదేవిధంగా, ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే దూరవిద్య (Distance Education) విధానంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుంటుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను సులభంగా పొందే అవకాశం కలుగుతుంది.
అడ్మిషన్లపై త్వరలో ప్రకటన
ఈ కోర్సుల ప్రవేశ ప్రక్రియ, అర్హతలు, ఫీజు నిర్మాణం, అడ్మిషన్ షెడ్యూల్ వంటి పూర్తి వివరాలను త్వరలో BRAOU అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచించారు.
ఎక్కడ సమాచారం పొందాలి?
అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్‌లైన్ అడ్మిషన్స్ పోర్టల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్త కోర్సుల ప్రారంభంతో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వేలాది మంది విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఇది మంచి అవకాశంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
