AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ - పారిశ్రామిక హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది.

ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!
Warangal Mamnoor Airport
Balaraju Goud
|

Updated on: Jul 16, 2026 | 12:01 AM

Share

తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ – పారిశ్రామిక హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది.

విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారు..!

గతంలో శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణ ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయాన్ని నిర్మించకూడదనే నిబంధన ఉండేది. ఈ సాంకేతిక నిబంధన కారణంగానే మామునూరు ఎయిర్‌పోర్ట్ ఫైల్ దశాబ్దాలుగా మూలనపడింది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ ఆంక్షల పీటముడి పూర్తిగా వీడింది. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ.. రాబోయే 2028 జూన్ 2 నాటికి మామునూరు ఎయిర్‌పోర్టును ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి రాబోయే రెండు మూడు వారాల్లోనే టెండర్లు పిలవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి

మామునూరు ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ, పూర్తిస్థాయి విమానాశ్రయ అభివృద్ధికి మొత్తం 950 ఎకరాల భూమి అవసరం కాగా.. గతంలోనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధీనంలో 697 ఎకరాలు అందుబాటులో ఉంది. అయితే, ఆధునిక రన్‌వే విస్తరణకు అవసరమైన మిగిలిన 253 ఎకరాల భూసేకరణ సవాలుగా మారింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రెవెన్యూ యంత్రాంగం.. గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి, మామునూరు పరిసర గ్రామాల్లోని 233 మంది రైతులు, ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. రన్‌వే విస్తరణ, విమానాల పార్కింగ్ బేలు, టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్, ఎయిరో సిటీ, పైలట్లు, సిబ్బంది నివాసాల కొరకు సమగ్ర డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధమైంది.

మారనున్న వరంగల్ ముఖచిత్రం

టెక్స్‌టైల్ హబ్‌గా, ఐటీ కేంద్రంగా శరవేగంగా విస్తరిస్తున్న వరంగల్ నగరానికి ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ తోడైతే అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని వ్యాపార, ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి, వందలాది ఐటీ కంపెనీల రాకకు ఈ విమానాశ్రయం ఒక గేమ్ ఛేంజర్‌లా మారనుంది. ఇది వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

రాజకీయంగా వేడెక్కిన క్రెడిట్ వార్

ఎయిర్‌పోర్ట్ పనులు పట్టాలెక్కక ముందే వరంగల్ జిల్లాలో రాజకీయంగా క్రెడిట్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ వల్లే ఈ అసాధ్యమైన ప్రాజెక్టు సాధ్యమైందని భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది. తాము అధికారంలోకి వచ్చాకే భూసేకరణ అడ్డంకులు, జీఎంఆర్ ఒప్పంద సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించారని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ అగ్ర నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ప్రచార హోరు సాగిస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్ట్ 12 ఏళ్లు మూలనపడిందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ విమర్శించారు. రాజకీయ వివాదాలు ఎలా ఉన్నా, 2028 జూన్ 2వ తేదీన మామునూరు రన్‌వేపై విమానం ల్యాండ్ కాబోతుండటంపై ఓరుగల్లు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us