TV9 Impact: ప్రజలకు – ప్రభుత్వానికి వారధి టీవీ9.. ఆ గ్రామ రైతుల కన్నీళ్లను తుడిచిన ‘అనగనగా ఒక ఊరు’..
ఒకప్పుడు.. ఇప్పుడూ భూమి వారిదే.. కానీ, ధరణి రికార్డుల్లో మాత్రం చేరలేదు.. అధికారుల తప్పిదంతో ఆ భూమి అటవీ భూమిగా రికార్డుల్లో చేరింది..
ఒకప్పుడు.. ఇప్పుడూ భూమి వారిదే.. కానీ, ధరణి రికార్డుల్లో మాత్రం చేరలేదు.. అధికారుల తప్పిదంతో ఆ భూమి అటవీ భూమిగా రికార్డుల్లో చేరింది.. దీంతో ఆ గ్రామ రైతులంతా ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారారు.. రైతుబంధు, రైతుభీమా, సబ్సిడీలు.. ఇలా ఏవీ అందలేదు.. పైగా పంటను అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఐదు ఏళ్లుగా తమకు న్యాయం చేయాలంటూ ఆ గ్రామంలోని రైతులు అధికారుల చుట్టూ తిరిగారు.. కానీ, వారికి న్యాయం మాత్రం జరగలేదు.. ఈ క్రమంలో టీవీ9 ప్రసారం చేసిన కథనాలు అధికారుల కళ్ళు తెరిపించాయి.. ఆ ఊరి రైతుల కన్నీళ్లను తుడిచాయి.. ధరణి దరి చేరని ఆ ఊరి రైతుల సమస్యకు దారి చూపాయి.. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఆ రైతులకు పట్టాలు జారీ చేసింది.. రైతు బంధు సాయాన్ని కూడా మంజూరు చేసింది. దీంతో పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయిన నారాయణపురం రైతులు టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు.. ప్లకార్డులతో టీవీ9 జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతుల కథ ఇది.. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల ఈ గ్రామస్థుల వ్యవసాయ భూములన్నీ రెవెన్యూ రికార్డులలో అటవీశాఖ భూములగా నమోదయ్యాయి.. పట్టా భూములు ధరణి పోర్టల్‌లో అటవీ భూములుగా చూపిస్తున్నాయి.
రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదంతో ఐదేళ్ళ నుండి బాధిత రైతులు తల్లడిల్లిపోయారు.. రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఫలాలు కోల్పోయారు. రైతు బంధు, రైతు భీమా, సబ్సిడీలు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోలేక అవస్థలు పడ్డారు.
ధరణి దరి చేరని ఈ ఊరి రైతుల వ్యధ పై టీవీ9 అనేక కథనాలు ప్రసారం చేసింది.. “అనగనగా ఒక ఊరు” కార్యక్రమం ద్వారా బాధిత రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
టీవీ9 కథనాలు అధికారుల కళ్ళు తెరిపించాయి.. ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి ప్రత్యేక చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. మొదటి విడత 252 మంది రైతులకు చెందిన 540 ఎకరాలు భూములకు డిజిటల్ సైన్ చేసి పట్టాలు అందజేశారు. ధరణి పోర్టల్‌లో ఓనర్ అడవి అని మాయమై వీళ్ల పేర్లు చేరాయి. దీంతో ఆనందంతో ఉప్పొంగి పోయారు
తన బాధ్యతగా ప్రజలకు – ప్రభుత్వానికి వారధిలా టీవీ9 నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది.
ఈ రైతుల జీవితాల్లో కన్నీరు తుడిచేసిన ఈ కవరేజ్ దానికి నిదర్శనం… #AnaganagaOkaooru – @TV9Telugu
@DayakarRao2019 @SingireddyTRS @KTRTRS
full story: https://t.co/N1iDodisbc pic.twitter.com/HmSFgzH6zo
— Rajinikanth Vellalacheruvu (@rajinikanthlive) December 28, 2022
రైతు బంధు దరఖాస్తు చేసుకునేందుకు కేసముధ్రం తహసీల్దార్ కార్యలయానికి వచ్చిన నారాయణపురం రైతులు టీవీ9 జిందాబాడ్ అంటూ నినాదాలు చేశారు.. ఆనందంతో ఉప్పొంగిపోయి టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు.
1240 ఎకరాలలో ప్రస్తుతం 840 ఎకరాలకు పట్టాలు లభించాయి.. మరో నాలుగు వందల ఎకరాల భూములకు పట్టాలు పెండింగులో ఉన్నాయి.. అవి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గత అధికారుల తప్పిదం వల్ల ఇంతకాలం ఈ రైతులంతా నరకం అనుభవించారు.. డిజిటల్ సైన్ పూర్తి చేసి రైతులకు పట్టాలు అందజేసిన రెవెన్యూ అధికారులు ఇది శుభపరిణామం అన్నారు. త్వరలోనే మిగిలిన రైతులకు కూడా పట్టాలు అందిస్తామని తెలిపారు. ఈ రైతుల వ్యధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపిన టీవీ9 కు గ్రామస్థులంతా ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..