AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన భార్య ప్లాన్ అనూహ్య మలుపు తిరిగింది. భర్త ఇంట్లో లేకపోవడంతో మామనే కిరాతకంగా హత్య చేశారు. వనపర్తి పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి
Wanaparthy Extramarital Affair
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jul 31, 2026 | 7:09 AM

Share

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయాలని స్కెచ్ వేసిన భార్య కుట్ర చివరకు మామ ప్రాణాలను బలితీసుకుంది. వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును పోలీసులు ఆధారాలతో సహా ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం లక్ష్మీతాండకు చెందిన మూడవత్ శ్రీనివాసులు, మమత దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌లోని బాలానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఏడేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. గత ఏడాది నుంచి మమతకు అదే ప్రాంతానికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త శ్రీనివాసులు పలుమార్లు భార్యను మందలించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా నిర్వహించారు.

అయితే పరిస్థితులు మరింత దిగజారడంతో ఓ సందర్భంలో శ్రీనివాసులు భార్యపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీనిపై మమత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసులును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం ఆయన తండ్రి మేఘా నాయక్ బెయిల్‌పై కుమారుడిని విడుదల చేయించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీనివాసులు, శ్రీశైలం మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్తను అడ్డుతొలగించాలని మమత నిర్ణయించుకుంది. ఈ నెల 25న శ్రీనివాసులు స్వగ్రామానికి వెళ్లిన విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు శ్రీశైలంకు సమాచారం ఇచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లి శ్రీనివాసులును హత్య చేయాలని పథకం రచించారు. అయితే ఇంటికి చేరుకున్న శ్రీశైలంకు శ్రీనివాసులు కనిపించలేదు. అక్కడ ఆయన తండ్రి మేఘా నాయక్ మాత్రమే నిద్రిస్తున్నాడు. ఈ విషయాన్ని మమతకు చెప్పగా, మామను చంపితే నా భర్త భయపడి మన జోలికి రాడు చంపేయ్ అని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

దీంతో శ్రీశైలం ఇంట్లో నిద్రిస్తున్న మేఘా నాయక్‌పై కత్తితో దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బైక్‌పై హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. అనుమానితులుగా మమత, శ్రీశైలంను గుర్తించి బాలానగర్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వనపర్తి డీఎస్పీ గిరిబాబు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us