AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు.. అప్పు చెల్లిస్తున్నా అమాయకులపై దాడులు..!

పాతబస్తీలో ఫైనాన్సర్ వేధింపులు తాళలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా పాతబస్తీలోని బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం ఏకంగా పోలీస్ వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారింది.

Telangana: రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు.. అప్పు చెల్లిస్తున్నా అమాయకులపై దాడులు..!
Money
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 18, 2024 | 6:12 PM

Share

హైదరాబాద్ మహానగరంలో అవినీతి, నేరాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. అక్రమ రీతిలో సంపాదనలు, అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పాతబస్తీలో ఫైనాన్సర్ వేధింపులు తాళలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా పాతబస్తీలోని బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం ఏకంగా పోలీస్ వ్యవస్థకే ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాతబస్తీలో వడ్డీ వ్యాపారాలు రెచ్చిపోతున్నారు. మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న వడ్డీ వ్యాపారులు తాజాగా మరోసారి వేధింపులతో తెరపైకి వస్తున్నారు. అవసరాల నిమిత్తం అప్పు కోసం వచ్చిన వారి నుంచి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. అప్పు చెల్లించడంలో ఆలస్యమైతే దాడులకు దిగుతున్నారు. ఇలా అవసరం నిమిత్తం రౌడీషీటర్లు, పహిల్వాన్ల వద్ద అప్పు తీసుకుని జీవితాంతం చక్రవడ్డీ కడుతూనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. రౌడీ షీటర్ల వేధింపులు తాళలేక ఎందరో మహిళలు తమ పరువుని కూడా తాకట్టు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే వడ్డీ కట్టలేదని ఏకంగా మహిళలని తీసుకెళ్లిపోయినా దౌర్భాగ్య పరిస్థితులు కూడా పాతబస్తీలో జరిగాయి. హైదరాబాద్ నగరంలో వడ్డీ వ్యాపారస్తులు అందరూ ఒక పద్దతిని అనుసరిస్తారు. అవసరంలో ఉండి తమ వద్దకు వచ్చినవారికి డబ్బులు అప్పుగా ఇచ్చి రూ.2 నుంచి రూ.4.. లేదా కొందరు ఏకంగా రూ.10 వడ్డీ వసూలు చేస్తుంటారు. తాజా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

పాతబస్తీలో నివసించే రహ్మతుల్లా అనే వ్యక్తి వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను ప్రతి 15 రోజులకు ఒకసారి 50 వేలు తిరిగి చెల్లించేలా.. ఈ లెక్కన మూడు నెలల్లో పూర్తి డబ్బును చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. ఇదే పద్దతిని అనుసరిస్తూ తాను సమయానికి డబ్బు కూడా చెల్లిస్తున్నట్లుగా కూడా బాధితుడు చెప్పుకొచ్చాడు. కానీ, డబ్బులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇప్పుడు మాట మారుస్తున్నారని, మరో మూడు నెలలు ఇదే విధంగా రూ.50 వేలు చెల్లించాలని, ఒప్పుకొని పక్షంలో తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను 5 గంటలకు ఇంటి నుంచి తీసుకెళ్లి 9.50 వరకు చిత్రహింసలు పెట్టారని వాపోయాడు.

అనంతరం తన అన్నను కూడా ఆ ఘటన స్థలానికి రప్పించి మాట్లాడారని తెలిపాడు. ఇష్టం వచ్చిన రీతిలో తమపై దాడికి పాల్పడ్డారని, తన కుటుంబ సభ్యులను కూడా చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపాడు. తన చేతులు, ముక్కు, తల భాగంలో తీవ్రంగా కొట్టారని.. పెదవి చిట్లి రక్తం వచ్చేలా తీవ్రంగా దాడి చేశారని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనతో తాను తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నానని, తాను మిగతా వేరే సమస్యలతో కూడా సతమతం అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇదే విషయమై బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఎలాగైనా ఈ సమస్య నుంచి తనను బయటపడేసి పోలీసులే తనకు సరైన న్యాయం చేయాలని వేడుకున్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..