ఉచిత ప్రయాణంలో మహిళల అత్యుత్సాహం.. బస్సు నుంచి దిగి కన్నీళ్లు పెట్టుకున్న మహిళా కండక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లో ఓ మహిళా కండక్టర్ వెళ్తున్న బస్సును అకస్మాత్తుగా ఆపి అందులో నుంచి దిగిపోయి బోరున విలపించింది. అసలేం జరిగిందో అర్థం కాని స్థానికులు ఆమె వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ మహిళా కండక్టర్ చెప్పిన మాటలు విని స్థానికులు అవాక్కయ్యారు.

ఎంకి పెళ్లి.. సుబ్బి సావు కొచ్చినట్లుగా ఉంది ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉద్యోగుల పాలటి శాపంగా మారింది. బస్సులో ఖాళీ లేదు, అన్నందుకు ఓ మహిళా కండక్టర్‌ను దూర్భాషలాడారు మహిళా ప్రయాణికులు. ఈ బస్సు మాది, నీతో పనేంటి అంటూ మహిళా కండక్టర్‌తో గొడవకు దిగారు. ఏం చేయాలో తెలియక బస్సులో నుండి దిగిపోయిన మహిళ కండక్టర్ బోరుమంటూ విలపించారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చూద్దాం..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. మహాలక్ష్మీ పథకం అమలులోకి వచ్చిన నాటి నుండి మహిళలతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉచిత ప్రయాణం పేరుతో రోజుకు వేలాది మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిళలు మాత్రం ఓ అడుగు ముందుకేసి బస్సుల్లో డ్రైవర్ ఉంటే చాలు కండక్టర్ మాకు అవసరం లేదంటూ మహిళా కండక్టర్లకు చుక్కలు చూపించారు. అంతేకాదు కూర్చోవడానికి కూడా సీట్లు లేకుండా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లో ఓ మహిళా కండక్టర్ వెళ్తున్న బస్సును అకస్మాత్తుగా ఆపి అందులో నుంచి దిగిపోయి బోరున విలపించింది. అసలేం జరిగిందో అర్థం కాని స్థానికులు ఆమె వద్దకు వెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ మహిళా కండక్టర్ చెప్పిన మాటలు విని స్థానికులు అవాక్కయ్యారు.
భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్లే పల్లె వెలుగు బస్సు సారపాక వచ్చేసరికి పూర్తిగా మహిళలతో నిండిపోయింది. దీంతో కనీసం నిలబడడానికి కూడా బస్సులో చోటు లేక పోవడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కాస్త జరగమంటూ మహిళా కండక్టర్ ప్రయత్నించింది. ఒక్కసారిగా కొందరు మహిళలు ఆమెపై విరుచుకుపడ్డారు. నానా బూతులు తిడుతూ దుర్భాషలాడారు. ఈ బస్సు మాది. డ్రైవర్ ఉంటే సరిపోతుంది. నీతో అవసరం లేదంటూ, ఆమెను తిట్టడంతో తట్టుకోలేని మహిళా కండక్టర్ రన్నింగ్ బస్సును నిలిపివేసి బోరున విలపిస్తూ దిగిపోయింది. ఓ మహిళా కండక్టర్ అని కూడా చూడకుండా సాటి మహిళలే ఆమె పట్ల ప్రవర్తించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. దీంతో ఆమె మనస్థాపం చెంది ఇలా అయితే ఉద్యోగం చేయలేమంటూ ఆవేదన స్థానికులను కూడా కలచి వేసింది. పై అధికారులకు జరిగిన విషయం చెప్పిన ప్రభుత్వ స్కీం కాబట్టి మనమేం చేయలేం అంటూ చేతులెత్తేయడంతో చేసేదేమీ లేక మళ్ళీ అదే బస్సులో వెళ్ళిపోయింది ఆ మహిళ కండక్టర్..
ఉచిత ప్రయాణం పేరుతో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణాలు చేస్తూ, ఓ పక్క ప్రభుత్వానికి నష్టం కలిగించడంమే కాక ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓ మహిళ కండక్టర్ పట్ల సాటి మహిళలే ఇలా ప్రవర్తించడం ఎంతో బాధాకరమని ఆ దృశ్యాలను చూసిన కొందరు స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు తీసుకు రావాలని, లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ప్రయాణికులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




