AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీ మీ బతుకులు చెడ..! ఆరుగాలం కష్టపడి రైతులు పంట పండిస్తే..

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వచ్చి రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న యువకుల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడింది. కేవలం 10 రోజుల్లో 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన ఈ ముఠాలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉండటం కలకలం రేపుతోంది.

చీ మీ బతుకులు చెడ..! ఆరుగాలం కష్టపడి రైతులు పంట పండిస్తే..
Thieves With Police
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 8:28 AM

Share

చదువుకుని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరబాట పట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతుంటే, కొందరు యువకులు మాత్రం అదే ధాన్యాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఖరీదైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో తిరుగుతూ, రైతులు ఆరబోసిన ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లి విక్రయించిన ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, కేవలం పది రోజుల వ్యవధిలో 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను ఈ ముఠా దోచుకుంది. రైతులు పొలాలు, కల్లాలు, రహదారుల పక్కన ఆరబోసిన ధాన్యం, బస్తాల్లో నింపి ఉంచిన ధాన్యాన్నే వీరు టార్గెట్‌గా చేసుకున్నారు.

ఈ దొంగతనాల కోసం నిందితులు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుని రాత్రి వేళల్లో సంచరించేవారు. రైతులు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడి నుంచి ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లేవారు. అనంతరం వాటిని మరో ప్రాంతంలో దాచిపెట్టి, తర్వాత దూర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు.

రెండు రోజుల క్రితం శాయంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా హనుమకొండ జిల్లాకు చెందిన ప్రతీక్, అస్లాం, రాహుల్ అనే ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు నేపాల్‌కు చెందిన మైనర్లు కాగా, ఒక యువతి కూడా ఉన్నట్లు వెల్లడైంది.

అరెస్టయిన వారిలో ఎక్కువ మంది 21 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. దొంగిలించిన ధాన్యాన్ని విక్రయించి వచ్చిన నగదును రాహుల్ ఇంట్లో నిల్వ చేసి, మొత్తం ఆపరేషన్ పూర్తయ్యాక పరస్పరం పంచుకోవాలని ముఠా ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పరకాల ఏసీపీ సతీష్ బాబు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.3,05,200 నగదు, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తొమ్మిది పోలీస్ స్టేషన్లలో ధాన్యం చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Follow Us