Khammam: ఇలాంటి పేద మహిళకు న్యాయం చేయలేని అధికారులు ఉంటే ఏం.. ఊడితే ఏం..
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రారంభమైన 'ఇందిరమ్మ ఇల్లు' పథకంలో ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన బందెల అన్నమ్మ అనే నిరుపేద వృద్ధురాలి పేరు సాంకేతిక కారణాలతో జాబితా నుంచి తొలగించారు. గత ఏడాది తుఫాన్‌తో రేకుల షెడ్డు కూలిపోవడంతో.. ఆమె ప్రస్తుతం మరుగుదొడ్లో నివాసం ఉంటూ, రోజూ ప్రమాదపు అంచున జీవనం సాగిస్తున్నారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరులో కొంతమంది నిరు పేదలకు అన్యాయం జరిగింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకంతో సంబుర పడ్డ పేదలంతా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంపికైన లబ్ధిదారులు ఆనందంగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటుంటే.. బాత్రూంలో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలకు అన్యాయం జరిగిన సంఘటన ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది ..ఏన్కూర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రేపల్లెవాడ గ్రామ నివాసి బందెల అన్నమ్మ అనే నిరుపేద వృద్ధురాలు మాత్రం మరుగుదొడ్లోనే నివాసం ఉంటున్నారు. ఊళ్లో అర్హులైన వారందరి పేర్లతో 95 మంది జాబితా ఉన్నతాధికారులకు పంపారు. కానీ సాంకేతిక కారణాలతో నిరుపేద వృద్ధురాలు అన్నమ్మ పేరును అర్హులు జాబితా నుంచి తొలగించారు.
ఆమె కేవలం ప్రభుత్వ పెన్షన్ 2 వేల రూపాయలతోనే కాలంగడుపుతున్నారు. అంతకు ముందు ఆమె నివాసం ఉన్న రేకులషెడ్డు గతేడాది కురిసిన భారీ వర్షాలతో కూలిపోయింది. షెడ్డు స్థానంలో పూరి గుడిసె వేసుకోలేని.. దుర్భర పరిస్థితుల్లో ఉంది అన్నమ్మ. ఇంటి ఆవరణలోని చిన్న మరుగు దొడ్డిలోనే ప్రస్తుతం జీవిస్తున్నారు. సాంకేతిక కారణాలతో తన పేరు తొలగించడం పట్ల ఆమె కన్నీరు మున్నీరయ్యారు.
ఇప్పుడు తాను ఉన్న మరుగు దొడ్డికి కరంట్ లేక టార్చిలైట్, దీపం బుడ్డి (నూనె దీపం)తో కాలం గడుపుతున్నారు. దాని చుట్టూ పాములూ తేళ్లు తిరుగుతుండటంతో రాత్రవుతుందంటేనే భయంభయంగాజీవిస్తున్నానని, నిద్ర పోవడానికి ఇబ్బంది పడుతున్నానని అన్నమ్మ వాపోయారు. వర్షాలొస్తే పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్రితం తుఫాన్ కారణంగా తనకున్న రేకుల షెడ్డు ఇల్లు కూలిపోవడంతో అప్పటినుంచి తనకున్న బాత్రూంలోనే నివాసం ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నానని తెలిపింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లలో తమ పేరు కూడా నమోదు చేశారని.. మంజూరైన ఇళ్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన పేరు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. గత సంవత్సరం కాలంగా బాత్రూంలోనే నివసిస్తున్నానని.. తనకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ తో జీవనం సాగిస్తున్నానని అన్మమ్మ చెబుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరుతోంది. మరి ఇప్పటికైనా ఆమె పరిస్థితి అధికారులకు కనిపిస్తుందో, లేదో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




