Telangana: 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన వన ప్రేమికుడికి అవార్డు.. సాధారణంగా కన్పించే అసాధ్యుడు!
మంచి ఆలోచనలు రోజుకు వేలకొద్దీ వస్తాయి. కానీ వాటిని చేతల్లో చేసి చూపించే సత్తా కొందరికే ఉంటుంది. అలాంటి వ్యక్తే సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ. ఈయనకు ప్రకృతంటే అమితమైన ప్రేమ. కానీ నేటి జనాలు అభివృద్ధి పేరుతో దానిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. దీంతో ఎంతో మదనపడిన ఆతడి బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.. అంతే యేళ్లకు యేళ్లు కష్టపడి దానికి ఓ రూపం ఇచ్చాడు..

సూర్యాపేట, జనవరి 22: కాసులకు కక్కుర్తి పడుతూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న నేటి ఆధునిక కాలంలో జీవవైవిధ్యానికి జీవం పోస్తున్న మహోన్నత వ్యక్తి అతను. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిలో అడవిని సృష్టించడంతోపాటు అందులో వివిధ రకాల పక్షులను, మొక్కలను పెంచి అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రకృతి ప్రేమికుడు. మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అడవులను కాపాడుతున్న పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడికి మరో అవార్డు వరించింది. ఆ ప్రకృతి ప్రేమికుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే…
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణకు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రకృతి అంటే ఆసక్తి. బ్యాంక్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన దుశ్చర్ల సత్యనారాయణ.. ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యపై జల సాధన పేరుతో ఉద్యమించిన దుశ్చర్ల సత్యనారాయణ.. వారసత్వంగా తనకు వచ్చిన 70 ఎకరాల భూమిని ఆరు దశాబ్దాలు శ్రమించి అడవిని సృష్టించాడు. మూగ జీవాలకు ఆవాసంగా.. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించేలా అడవిగా మార్చాడు. ఐదెకరాల్లో పక్షులు, జంతువులకు ఉపయోగపడే పంటలను సాగుచేశారు. భూగర్భ జలాల పెంపు, జంతువులు, పక్షుల తాగునీటికి 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్ల బోర్లు వేయించారు. అడవిల్లో మాదిరిగా ఉండే పలు రకాల పక్షులు, జంతువులకు ఆవాసంగా ఈ అడవిని మార్చి జీవ వైవిధ్యానికి జీవం పోస్తూ పర్యావరణ వేత్తగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపిక…
ప్రకృతిని కాపాడుతూ 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణకు అనేక అవార్డులు వరించాయి. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌లో నాలుగో నది ఉత్సవంలో పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణపై “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ” అనే డాక్యుమెంటరీ ప్రదర్శించారు. తాజాగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆరుగురిని రాజ్‌భవన్ వర్గాలు ఎంపిక చేశాయి. వారిలో సత్యనారాయణ ఒకరు. ఈ నెల 26న రాజ్‌భవన్‌లో నిర్వహించే గణతంత్ర దినోత్సవనంలో దుశర్ల సత్యనారాయణకు తెలంగాణ గవర్నర్-2024 అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్‌తో పాటు రూ.2లక్షల నగదును గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అందజేస్తారు. ఈ సందర్భంగా దుశ్చర్ల సత్య నారాయణ మాట్లాడుతూ ఈ అవార్డు ఎంపికతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.