AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: బడ్జెట్ చరిత్రలో అరుదైన రికార్డ్.. అత్యంత తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ ఎవరిదంటే..?

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఉదయం 10 గంటలకు ఆమె పార్లమెంట్‌కు చేరుకోనుండగా.. 10.15 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత నిర్మలమ్మ పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పిస్తారు. ఈ సారి బడ్జెట్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

Union Budget 2026: బడ్జెట్ చరిత్రలో అరుదైన రికార్డ్..  అత్యంత తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ ఎవరిదంటే..?
Budget
Venkatrao Lella
|

Updated on: Feb 01, 2026 | 8:45 AM

Share

కేంద్ర ప్రభుత్వ 2026-27 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. ఈ సారి బడ్జెట్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నిర్మలమ్మ ఏకంగా వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ అరుదైన ఘనతను సాధించారు. ఇక దేశ చరిత్రలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 28,1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో అప్పటి ఆర్ధికశాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఆదివారం ప్రభుత్వ సెలవు రోజైనా బడ్జెట్ పెడుతున్నారు. దీంతో ఇది కూడా ఒక ప్రత్యేకతగా మారింది. బడ్జెట్ ప్రకటన అనగానే గంట నుంచి రెండు గంటల సమయం వరకు ఆర్ధికశాఖ మంత్రి ప్రసంగం ఉంటుంది. కానీ దేశ చరిత్రలో అతి తక్కువ సమయం ప్రసంగం చేసిన రికార్డ్ ఎవరి పేరు ఉందో ఇప్పుడు చూద్దాం.

కేవలం 800 పదాల బడ్జెట్ ప్రసంగం

ఇప్పుడు మనం బడ్జెట్ అనగానే పార్లమెంట్‌లో ఆర్ధికశాఖ మంత్రి సుదీర్ఘంగా గంటకుపైగా ప్రసంగం చేయడం చూస్తున్నాం. కానీ 1977లో అప్పటి ఆర్ధికశాఖ మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ అతి తక్కువ సమయం ప్రసంగం చేశారు. కేవలం 800 పదాలతో తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం చేశారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగంగా కొనసాగుతోంది. దేశ చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం చేసిన నాయకుడిగా హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ పేరు మీదనే ఇప్పటికీ ఆ రికార్డ్ ఉంది.

అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఎవరంటే..?

ఇక దేశ చరిత్రలో అత్యంత ఎక్కువసేపు బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ నిర్మలా సీతారామన్ సొంతమని చెప్పవచ్చు. 2020 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటన సమయంలో ఆమె ఏకంగా 2.40 గంటల పాటు ప్రసంగం చేశారు. ఇదే అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగంగా రికార్డ్ సృష్టించింది.

అత్యధిక సార్లు బడ్జెట్

దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సొంతం. ఆయన 1959 నుంచి 1964 మధ్య ఆరుసార్లు, 1967 నుంచి 1969 మధ్య మరో నాలుగుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక చిదంబరం తొమ్మిదిసార్లు, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ఇవాళ తొమ్మిదోసారి బడ్జెట్ పెట్టి చిదంబరం రికార్డుకు చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ బడ్జెట్ పెట్టనుండగా.. దాని కంటే ముందు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇందుకోసం ఉదయం 10.15 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.