Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని అర్ధరాత్రి విద్యార్థి గెంటివేత!

ఫీజులపై ఉన్న ధ్యాస విద్యార్ధుల భవితవ్యం లేదనే విషయం మరోమారు నిరూపించుకుంది శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ. తాజాగా ఓ విద్యార్ధి సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి కాలేజీలో చేరేందుకు తండ్రితోపాటు వస్తే.. ఫీజు చెల్లించలేదని నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటివేసి గేట్లు వేశారు. దీంతో అర్ధరాత్రి వరకు చలిలోనే విద్యార్ధి, అతడి తండ్రి కాలేజీ గేటు వద్ద పడిగాపులు కాశారు..

శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని అర్ధరాత్రి విద్యార్థి గెంటివేత!
Student Expelled From Sri Chaitanya Junior College
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 21, 2025 | 11:00 AM

కంకిపాడు, జనవరి 21: ఫీజు కట్టలేదని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ యాజమన్యం విద్యార్ధి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి కళాశాల నుంచి బయటకు నెట్టివేశారు. దీంతో చలిలో వణుకుతూ రాత్రంతా విద్యార్ధి గేటు వద్దనే పడిగాపులు కాశాడు. దీనిపై మీడియాకు సమాచారం అందడంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. ఈ దారుణ ఘటన విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాలలో చోటు చేసుకుంది. బాధిత విధ్యార్ధి తెలిపిన కథనం ప్రకారం..

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆబోతు టార్జాన్‌ కుమారుడు గౌతమ్‌.. విజయవాడ సమీపంలోని గోసాలలో ఉన్న శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఈ నెలలో సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్లిన గౌతమ్‌ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు తిరిగి వచ్చాడు. అయితే కళాశాల యాజమన్యం మాత్రం ఫీజు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తామని తెగేసి చెప్పింది. దీంతో గౌతమ్‌ తండ్రి టార్జాన్‌ తన వద్ద ఉన్న రూ.20 వేలు నగదును ఫీజు కింద చెల్లించాడు. మిగిలిన రూ.50 వేలు కూడా చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని కళాశాల సిబ్బందిని బతిమలాడారు. అందుకు ససేమిరా అన్న యాజమాన్యం విద్యార్థిని కళాశాల నుంచి బయటకు పంపించేసి, గేట్లు మూసి వేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్‌ నిరసనగా అర్ధరాత్రి కాలేజీ గేటు వద్దే కుర్చుని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై విద్యార్ధి తండ్రి టార్జాన్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వచ్చే ఏప్రిల్‌ నెలలో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని, నిర్ధాక్షిణ్యంగా తమ కుమారుడిని బయటకు నెట్టివేశారని చెప్పి వాపోయారు. పోలీసులతోపాటు మీడియా కూడా కళాశాలకు వద్దకు చేరుకుని ఆరా తీయడంతో.. వెంటనే అప్రమత్తమైన శ్రీచైతన్య కాలేజీ యాజమన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి.. విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. ఫీజులు గుంజడంపైనే ద్యాస పెట్టిన శ్రీచైతన్య కాలేజీ తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.