Hyderabad: కౌలాలంపూర్ ఫ్లైట్‌లో తేడాగా కనిపించిన బట్టల బ్యాగ్.. చెక్ చేసి చూస్తే, కోట్ల విలువైన విదేశీ కరెన్సీ!
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భగ్నం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్‌కు విమానంలో వెళ్లేందుకు సిద్ధమైన ఓ దంపతుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో కలకలం రేపింది.

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా యత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భగ్నం చేశారు. మలేషియాలోని కౌలాలంపూర్‌కు విమానంలో వెళ్లేందుకు సిద్ధమైన ఓ దంపతుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో కలకలం రేపింది.
లగేజీలో దాచిన అమెరికా డాలర్లు
అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్ ఏషియా విమానంలో కౌలాలంపూర్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా, ట్రాలీ బ్యాగులోని దుస్తుల మధ్య నల్ల ప్లాస్టిక్ కవర్లలో దాచిన విదేశీ కరెన్సీ బయటపడింది. అతడి వద్ద నుంచి 66,600 అమెరికా డాలర్లు, 3,773 మయన్మార్ కరెన్సీ యూనిట్లు, రెండు సింగపూర్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.66.62 లక్షలుగా అంచనా వేశారు.
మహిళా ప్రయాణికురాలి వద్ద మరో రూ.91.94 లక్షలు
అదే విమానంలో వేరే పీఎన్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఓ మహిళ కూడా అతడితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన అధికారులు నిఘా పెట్టి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా, దుస్తుల మధ్య దాచిన 97,600 అమెరికా డాలర్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.91.94 లక్షలుగా అంచనా వేశారు.
ఇద్దరి అరెస్ట్.. కరెన్సీ స్వాధీనం
విదేశీ కరెన్సీకి సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీతో పాటు, వాటిని తరలించేందుకు ఉపయోగించిన ట్రాలీ బ్యాగులను కస్టమ్స్ చట్టం, 1962 ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని దుస్తుల మధ్య దాచి విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఈ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
