బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు.. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Cyclone Arnab Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ, ఒడిశా తీరాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆగ్నేయ, ఆనుకొని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వాయుగుండంగా మారి.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఇది మరింత బలపడి ఆ తదుపరి 2 రోజులలో ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.. అక్టోబర్ 26 నుంచి గంటకు 70–80 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి.. గరిష్ఠంగా గంటకు 90 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. ఏపీ, ఒడిశా తీరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సైక్లోన్ అర్నాబ్..
ఒకవేళ అక్టోబర్ 26 నాటికి తుపానుగా బలపడితే.. దీనికి ‘అర్నబ్’ (Cyclone Arnab) గా నామకరణం చేయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగాలీ భాషలో ‘అర్నబ్’ అంటే ‘సముద్రం’ అని అంటారు. బంగ్లాదేశ్ దీనిని ప్రతిపాదించింది.
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో తీరప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు.
శనివారం ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
శనివారం ( 24-10-2026) : కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా , గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులతోపాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.
ప్రజలు, రైతులు తమ కార్యకలాపాలలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
