Video: భర్త ప్రేమగా కౌగిలించుకున్నాడు.. భార్యకు 5 పక్కటెముకలు ఫ్రాక్చర్.. కారణం తెలిసి షాక్!
చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. చలిగా ఉందని చెప్పడంతో 39 ఏళ్ల భార్యను ప్రేమగా కౌగిలించుకున్నాడు ఓ భర్త. ఆమె కూడా భర్త మెడ చుట్టూ చేతులు వేసి తిరిగి కౌగిలించుకుంది. ఆ ఒత్తిడికి ఆమె ఐదు పక్కటెముకలు విరిగాయి. మరో ఎముకకు పగులు ఏర్పడింది. ఇంతకీ అసలేం జరిగింది? ఆమె ఎముకలు బలహీనంగా మారడానికి కారణమేంటి?

చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. చలిగా ఉందని చెప్పడంతో 39 ఏళ్ల భార్యను ప్రేమగా కౌగిలించుకున్నాడు భర్త. ఆమె కూడా భర్త మెడ చుట్టూ చేతులు వేసి తిరిగి కౌగిలించుకుంది. ఆ ఒత్తిడికే ఆమె ఐదు పక్కటెముకలు విరిగాయి. మరో ఎముకకు పగులు ఏర్పడింది. ఇంతకీ అసలేం జరిగింది? ఆమె ఎముకలు బలహీనంగా మారడానికి కారణమేంటి?
భార్యను కౌగిలించుకున్న భర్త.. వినిపించిన శబ్దం!
చైనాకు చెందిన వాంగ్ భార్య చలిగా ఉందని చెప్పడంతో ఆమెకు వెచ్చదనం కలిగించే ఉద్దేశంతో భార్యను కౌగిలించుకున్నాడు. అయితే ఆ సమయంలో అతడికి ఏదో విరిగినట్లు శబ్దం వినిపించింది. వెంటనే భార్య తీవ్ర నొప్పితో కింద కూర్చుండిపోయింది. తిరిగి లేచి నిలబడటానికి కూడా ఇబ్బంది పడింది. మొదట్లో అది కండరాల నొప్పి భావించి వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా మరుసటి రోజు వరకు వేచి చూశారు. చివరకు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.
వైద్య పరీక్షల్లో షాక్.. ఐదు పక్కటెముకలు విరిగినట్లు గుర్తింపు!
జిన్‌మిన్ ఈవెనింగ్ న్యూస్ సహా పలు మీడియా కథనాల ప్రకారం.. ఆసుపత్రిలో వైద్యులు ఛాతీకి సీటీ స్కాన్ (CT Scan) చేసారు. ఆ పరీక్షల్లో ఐదు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. ఆరో పక్కటెముకలో చిన్న పగులు ఏర్పడింది. సాధారణంగా పడిపోవడం, ప్రమాదాలు జరగడం లేదా బలమైన దెబ్బలు తగలడం వల్ల పక్కటెముకలు విరిగే అవకాశం ఉంది. కానీ ఈ మహిళ విషయంలో సాధారణ కౌగిలింతకే ఎముకలు విరిగిపోయాయి. దీంతో వైద్యులు ఆమెకు తీవ్రమైన ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య కారణంగా ఎముకలు బలహీనపడి, చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోయే ప్రమాదం ఉంది. వైద్యులు ఆమెకు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఎముకలు కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు నొప్పి తగ్గేందుకు ప్రత్యేక ప్యాచ్‌లను అందించారు.
View this post on Instagram
ఎముకలు బలహీనపడటానికి కారణమేంటి?
వాంగ్ తన భార్య రోజువారీ అలవాట్ల గురించి వైద్యులకు వివరించాడు. ఆమె బరువు 45 నుంచి 50 కిలోల మధ్యే ఉంది. అంత తక్కువ బరువున్నా మరింత బరువు తగ్గేందుకు రోజూ కఠిన ఆహార నియమాలు పాటించేదనీ, రాత్రి భోజనం మానేసేదని చెప్పాడు. ఎక్కువగా కాఫీ తాగేదని, ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపేదని, బయటకు వెళ్లినప్పుడు శరీరమంతా కప్పుకునేదని తెలిపాడు. ఈ అలవాట్ల కారణంగా ఆమె శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ డి తగినంతగా అందక సమస్య వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. విటమిన్ డి శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆహారం ద్వారా అందాల్సిన పోషకాలు అందకపోవడం, ఇతర ఆరోగ్య కారణాలు కలిసి ఎముకలు బలహీనపడ్డాయి. వయస్సు, హార్మోన్ల లో మార్పులు, ఇతర సమస్యలు కూడా ఆస్టియోపొరోసిస్‌కు కారణం కావచ్చని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత వాంగ్ భార్య తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఎక్కువసేపు ఇంట్లో ఉండకుండా ఇంటి బయటకు వెళ్లి సూర్యరశ్మి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఆస్టియోపొరోసిస్ అంటే ఏమిటి?
ఎముకల సాంద్రత తగ్గి బలహీనపడే పరిస్థితిని ఆస్టియోపొరోసిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో చిన్నపాటి ఒత్తిడి, చిన్నగా కింద పడ్డా లేదా సాధారణ కదలికల సమయంలోనూ ఎముకలు విరిగే ప్రమాదం ఉంది. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ఎముక విరిగిన తర్వాతే చాలా మందికి ఈ సమస్య బయటపడుతుంది. అందుకే ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. కాల్షియం, విటమిన్ డి తగినంతగా అందేలా చూసుకుంటూ పోషకాహారం తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు శారీరక వ్యాయామం చేయాలి.