కాంగ్రెస్ నేతలపై సీక్రెట్ స్టింగ్‌కు స్కెచ్? బిజినెస్ మీటింగ్ పేరుతో పొలిటికల్ ట్రాప్? సీఎం సంచలన ఆరోపణ!
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో ఓ పారిశ్రామికవేత్త రహస్యంగా రికార్డు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నంగా డీకే అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతలపై సీక్రెట్ స్టింగ్‌కు స్కెచ్ వేశారా..? బిజినెస్ మీటింగ్ పేరుతో వచ్చి.. పొలిటికల్ ట్రాప్‌కు ప్రయత్నించారా..? కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఓ పారిశ్రామికవేత్త మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో తనను రహస్యంగా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించారన్నది డీకే అనుమానం.
డీకే శివకుమార్‌ను కలిసేందుకు ఓ పారిశ్రామికవేత్త వచ్చారు. మొదట అంతా బిజినెస్ టాక్..! వ్యాపారానికి సంబంధించిన అంశాలపైనే చర్చ..! కానీ కాసేపటికే సంభాషణ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వ్యాపార విషయాలను పక్కనపెట్టి.. రాజకీయ వ్యూహాలపై ఆరా తీయడం మొదలుపెట్టారట. ఏకంగా బూత్ లెవల్ పాలిటిక్స్ వరకు వెళ్లడంతో డీకేకు అనుమానం వచ్చింది. దీనికితోడు ఆ పారిశ్రామికవేత్త మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి ఉండటం మరిన్ని సందేహాలకు కారణమైంది. తన నుంచి రాజకీయంగా కీలకమైన సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారన్నది డీకే ఆరోపణ. దీంతో ఆ వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌పై ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు.
తనను కలిసిన పారిశ్రామికవేత్త ఇతర ప్రముఖ రాజకీయ నేతలనూ కలిశారని డీకే చెబుతున్నారు. కేరళ కాంగ్రెస్ సీఎం వీడీ సతీశన్‌తో సమావేశమైనప్పుడూ మెటా గ్లాసెస్ ధరించారని అంటున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు ఓ కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మాత్రం ఆ గ్లాసెస్ పెట్టుకోలేదన్నది డీకే వాదన. ఈ వ్యవహారాన్ని డీకే శివకుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఒకే వ్యక్తి.. వేర్వేరు రాజకీయ నేతలతో భేటీలు..! కానీ కాంగ్రెస్ నేతలతో సమావేశాల్లోనే స్మార్ట్ గ్లాసెస్ ఎందుకు..? ఇది యాదృచ్ఛికమా..? లేక స్టింగ్ ఆపరేషన్‌కు స్కెచ్చా..? ఈ అనుమానాల నిగ్గుతేల్చేందుకే అంతర్గత విచారణకు ఆదేశించినట్లు డీకే వెల్లడించారు.
తనతో సమావేశమైన పారిశ్రామికవేత్త ఎవరెవరిని కలిశారు..? ఆయా సమావేశాల్లో ఏం మాట్లాడారు..? స్మార్ట్ గ్లాసెస్ ఎందుకు ధరించారు..? అనే అంశాలపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు వారి వ్యక్తిగత సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్, ఇతరత్రా ట్రాప్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
మొత్తానికి డీకే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని నేతలను టార్గెట్ చేస్తున్నారా..? లేక బిజినెస్ మీటింగ్ పేరుతో స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారా? అసలు ఆ పారిశ్రామికవేత్త ఎవరు..? ఆయన వెనుక ఎవరున్నారు..? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
