Telangana IPS Cadre: తెలంగాణ ఐపీఎస్‌లల్లో అసంతృప్తి రాగం.. అసలు సమస్యల చిట్టా ఇదే..
IPS Cadre in Telangana: తెలంగాణ ఐపీఎస్ అధికారుల్లో ఇన్‌ఛార్జ్‌లు ఎక్కువైపోయారు, తెలంగాణ రాష్ట్రానికి సరైన స్థాయిలో ఐపీఎస్‌లు ఉన్నప్పటికీ కూడా ఇన్‌ఛార్జ్‌లకే పోస్టింగ్స్ ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
IPS Cadre in Telangana: తెలంగాణ ఐపీఎస్ అధికారుల్లో ఇన్‌ఛార్జ్‌లు ఎక్కువైపోయారు, తెలంగాణ రాష్ట్రానికి సరైన స్థాయిలో ఐపీఎస్‌లు ఉన్నప్పటికీ కూడా ఇన్‌ఛార్జ్‌లకే పోస్టింగ్స్ ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇతర రాష్ట్రాల ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తున్నారన్న విమర్శలు ముందు నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎస్ లు నిర్వహిస్తున్న పోస్ట్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో ఐపీఎస్ అధికారులు నిర్వహిస్తున్న వింగ్స్ ఒక్కొక్కరికి 3, 4 విభాగాల చొప్పున విధులు నిర్వహిస్తుండటం ఐపీఎస్‌లల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. 14 మంది ఐపీఎస్ అధికారులకు తమ పోస్టింగ్‌లతో పాటు ఇతర డిపార్ట్‌మెంట్లు సైతం మెయింటెన్ చేయడం కష్టతరంగా మారింది. తెలంగాణకు రాష్ట్ర విభజనలో భాగంగా 116 మంది కేటాయించగా , తాజా ఐపీఎస్ రిక్రూట్మెంట్ ప్రకారం 139 ఐపీఎస్‌లను కేటాయించినప్పటికీ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇన్‌ఛార్జ్‌లుగానే చాలా మంది కొనసాగుతున్నారు.
హైదరాబాద్ సీపీగా పనిచేసిన అంజనీకుమార్‌ను ఏసీబీ డీజీగా ఫుల్ చార్జ్ ఇస్తూ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కానీ అంజనీకుమార్‌ను ఏసీబీ డీజీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఇంచార్జ్ డీజీపీగా నియమించింది. సీనియర్ ఐపీఎస్ అడిషనల్ డీజీగా ఉన్న నాగిరెడ్డి ప్రస్తుతం ఏడీజీ హోదాలో వరంగల్ రేంజ్ ఐజీగా కొనసాగుతున్నారు, ఏడీజీగా ఉన్న నాగిరెడ్డి కరీంనగర్ రేంజ్ డీఐజీ, వరంగల్ డీఐజీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్న కమలహాసన్‌రెడ్డికి నిజామాబాద్ రేంజ్ డీఐజీ, హైదరాబాద్ రేంజ్ డీఐజీగా ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా కొనసాగుతున్న జితేందర్ జైళ్లశాఖకు ఇన్‌ఛార్జ్ డీజీగా కొనసాగుతున్నారు. ఏడీజీ వెల్ఫేర్‌గా కొనసాగుతున్న ఉమేష్‌షరాఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా, ఎస్పీఎఫ్ ఇన్‌ఛార్జ్ డీజీగా కొనసాగుతున్నారు. ఐజీ హోంగార్డ్స్‌గా కొనసాగుతున్న విజయ్‌కుమార్‌కు హోంగార్డ్స్‌తో పాటు కోఆర్డినేషన్ ఐజీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇక పోలీస్‌శాఖలో అత్యంత కీలకంగా భావించే పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్న వీవీ శ్రీనివాస్‌రావుకు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌తో పాటు ఐజీ ట్రేనింగ్ ఐపీఎస్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ పోలీస్ స్పెషల్ ఫోర్స్ అడిషనల్ డీజీగా ఉన్న అభిలాషబిస్త్‌గు ఎఫ్ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మావోయిస్టు ఆపరేషన్ నిర్వహించే గ్రేహౌండ్స్ చీఫ్‌గా కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి గ్రేహౌండ్స్ చీఫ్‌తో పాటు ఆక్టోపస్ ఐజీ, ఆపరేషన్స్ అడిషనల్ డీజీగా ఇంచార్జ్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర హోం సెక్రటరీగా కొనసాగుతున్న రవి గుప్తకు రోడ్ సేఫ్టీ అథారిటీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. సంజయ్ కుమార్ జైన్ అనే ఐపీఎస్ అధికారికి పీఅండ్ ఎల్ ఐజీతో పాటు ఫైర్ డీజీగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఇక చివరకు రాజీవ్ రతన్‌కు ఏడీజీ ఆర్గనైజేషన్‌తో పాటు లీగల్ సెల్‌ను అప్పగించారు.
ఒక వైపు తెలంగాణ ఐపీఎస్‌లకు రాష్ట్రంలో పోస్టింగ్స్ రావట్లేదంటూ వస్తున్న విమర్శల నేపధ్యంలో ఒక్కో అధికారికి ఇన్ని శాఖలు కేటాయించడంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కీలక అధికారులకు చాలా శాఖలు కేటాయించడం ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తుంది.
Also Read: