Mancherial: విద్యార్థులుగా మారిన నేతలు..! బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మైమరిచిపోయారు..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు లక్ష్మేట్టిపేటలోని నూతన ప్రభుత్వ కళాశాలను సందర్శించి, విద్యార్థి జీవితం గురించి గుర్తు చేసుకున్నారు. అలా కొద్ది సేపు విద్యార్థుల్లా మారిపోయారు.

వాళ్లంతా ప్రజాప్రతినిధులు.. అందులోనూ ఒకరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, మరో ముగ్గురు కీలక శాఖల మంత్రులు. ఇంకొకరైతే ఆ నియోజక వర్గానికి ఎమ్మెల్యే. అయితేనేం వారంతా మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయారు. నిత్యం క్షణం తీరిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో బిజీబిజిగా గడిపే ఆ ఐదుగురు ఆ కళాశాలలో విద్యార్థులుగా మారి ఆనందంగా గడిపారు. ఆ గంట పాటు విద్యార్థులుగా మారిపోయారు. విద్యార్థుల్లా బెంచీల మీద కూర్చుని గతాన్ని నెమరేసుకున్నారు. వారు ఎవరో కాదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు.
- Eating Food
మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా లక్షెట్టిపేటలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వీరంతా లక్షేట్టిపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించి నూతనంగా నిర్మించిన లక్షేట్టిపేట ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఇదిగో ఇలా సందడి చేశారు. లక్షేట్టిపేటలో రూ.10.20 కోట్లతో నిర్మాణామైన ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తాజాగా ప్రారంభ కాగా, ఆ కళాశాలను సందర్శించారు. అక్కడి బెంచీలను చూసిన డిప్యూటీ సీఎం విక్రమార్క వాటిపైనే కూర్చున్నారు. భవనం చాలా బాగుందని, లోపల కూడా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. అదే సమయంలో మిగతా ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సైతం అవే బెంచీలపై కూర్చుండిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థి జీవితం గురించి మాట్లాడుకుంటూ నేతలు నవ్వుకున్నారు. కొద్దిసేపు వాళ్లే విద్యార్థులుగా మారిన వైనం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





