Bhatti on DSC: 6 వేల పోస్టులతో త్వరలో మరో డీఎస్సీ.. నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా..!
నిరుద్యోగుల ఆందోళనలు ఉదృతమవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి కీలక భరోసా ఇచ్చారు.

నిరుద్యోగుల ఆందోళనలు ఉదృతమవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి కీలక భరోసా ఇచ్చారు. ఇదే చివరి డీఎస్సీ కాదని, మరిన్ని తీస్తామన్నారు. త్వరలో 5 -6 వేల పోస్టులతో మరో డీఎస్సీ తీస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టిందని, ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు. మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేసిన భట్టి, కేసిఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని విరుచుకుపడ్డారు.
విద్యా వ్యవస్థ బలోపేతం చేయడంలో భాగంగా పేద విద్యార్థులకు మంచి విద్యానందించాల్సిన అవసరముందన్నారు భట్టి. త్వరలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క.. నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ఆటలాడిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పదేళ్లు డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో గ్రూప్ వన్, గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోయిందన్న భట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 11వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామన్న భట్టి, 19,718 టీచర్ల ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియ చేపట్టామని వివరించారు. ఇక డీఎస్సీ పరీక్ష కోసం మొత్తం 2లక్షల 79వేలమంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే 2లక్షల 500కు పైగా అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. కొందరు పరీక్షలు వాయిదా వేయాలంటూ ధర్నాలు చేస్తున్నారని, ప్రస్తుత సమయంలో తగదని, దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. మరో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు పాఠాలు చెప్పాలనేది మా ప్రభుత్వం కోరిక అన్న భట్టి, డీఎస్సీని సక్రమంగా వినియోగించుకోవాలని అభ్యర్థులను కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
