Telangana: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లు
తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వీరి కోసం ప్రత్యేక విద్యుత్ అంబులెన్స్‌లను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది. రైతులు పొలాల్లో విద్యుత్ సమస్యను ఎదుర్కొన్నట్లేతే ఈ స్పెషల్ విద్యుత్ అంబులెన్స్‌లు తక్షణమే పరిష్కారం చేస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. రైతులకు కరెంట్ సమస్యలు ఉంటే వెంటనే 1912 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని, గంటల వ్యవధిలోనే అధికారులు స్పందించి పరిష్కారం చేస్తారని తెలిపారు. వారానికి మూడు రోజులు పొలాల్లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లోడ్ ఎక్కువ ఉంటేనే ట్రాన్స్‌ఫార్మర్లు
రైతులకు విద్యుత్ లోడ్ అదనంగా అవసరం ఉంటేనే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం అమలు చేసేందుకు రెడీగా ఉందన్నారు. తెలంగాణలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకున్నవారికి గృహలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, దీని వల్ల పీఎం సుర్యఘర్ పథకంలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో మోడల్ సోలార్ ప్రాజెక్ట్ కోసం పలు గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ మంత్రిని తాను కోరినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శాసనమండలిలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు.
నేతన్నలకు రుణమాఫీ
తెలంగాణలో నేతన్నల రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నేత పనులు కోసం బ్యాంకుల నుంచి రూ.లక్షలోపు తీసుకున్న లోన్లను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్య తీసుకున్న నేతన్నల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల 21 జిల్లాల్లోని నేత కార్మికులు లబ్ది పొందనున్నారని స్పష్టం చేశారు. అటు ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా నేతన్నలకు ఉపాధి లభిస్తుందని తుమ్మల పేర్కొన్నారు.
