AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains: వానమ్మా..! నీ జాడ ఏదమ్మా..? ముందుగానే పలకరించినా పనికిరాని తొలకరి

గత ఖరీఫ్‌ సీజన్ రైతులను కన్నీళ్లు పెట్టించింది. ఈసారి కూడా ఖరీఫ్‌ పంటపై అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. కరుణించని వరుణుడు.. నకిలీ విత్తనాల బెడద, మండుతున్న ఎరువుల ధరలు అన్నీ కలిపి రైతు నడ్డి విరిచేస్తున్న పరిస్థితి. మొత్తంగా అన్నదాతకు మళ్లీ కష్టాల సేద్యం తప్పేలా లేదు.

Rains: వానమ్మా..! నీ జాడ ఏదమ్మా..? ముందుగానే పలకరించినా పనికిరాని తొలకరి
Delayed Monsoon
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2025 | 9:31 PM

Share

ఈసారి రుతుపవనాలు కరుణించడంతో మే చివరి వారంలోనే పలకరించింది తొలకరి. జూన్ మొదటి వారంలో దంచికొట్టిన వర్షాలతో విత్తనాలను సైతం నాటుకున్నారు రైతులు. అంతలోనే జూన్ రెండవ వారంలో వాన చినుకు కానరాక.. ఎదురుచూసీచూసీ వేసారి పోతున్నాడు. మొలకెత్తిన విత్తనాలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు.

ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 5.8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతోంది. ఇక్కడ పత్తి పంటే ప్రధానం. ఆ తర్వాత సోయాబీన్, కంది, మొక్కజొన్న, వరి, పెసర, మినుము.. చిన్నపాటి పంటలన్నీ సాగుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. వర్షం జాడే లేదు. అటు.. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టకపోవడం పత్తి పంటపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి విత్తనాలు వేసుకోవద్దని, వర్షాకాలం ప్రారంభానికి ఇంకా సమయం ఉందని, వరుస వానలతో భూమి లోపలి పొరలు తడిశాకే విత్తుకోవాలనేది వ్యవసాయ శాఖ అదికారుల సూచన. ఈ సూక్ష్మం తెలీక గత ఏడాది కొందరు రైతులు వర్షాలు సరిగ్గా కురవకముందే రెండుమూడు సార్లు విత్తనాలు వేసి నష్టపోయారు. వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పుల కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం అల్లాడిపోతోంది. దున్నిన చేలు, పొలాలు పొడి గాలులతో ఎండిపోతున్నాయి. దీంతో.. వర్షాధారిత పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. అప్పులపాలవక తప్పదా అని వాపోతున్నారు రైతులు.

వరంగల్ జిల్లా రైతాంగానిది మరో వింత కష్టం. అసలే వర్షాభావంతో తల్లడిల్లుతుంటే ఎలుకలొచ్చి భూమిలో విత్తిన విత్తనాలను తినిపారేస్తున్నాయి. విత్తనాలను కాపాడుకుంటూ వర్షంకోసం ఆకాశంవైపు ఆర్తిగా చూస్తున్నాడు రైతన్న.  వర్షపు చుక్క కోసం ఆకాశం వైపు చూడ్డంతో సరిపెట్టుకోకుండా.. గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు రైతులు. వానలు కురిసి పంటలను కాపాడాలని వాన దేవతలకు మొక్కుతూ కోలాటాలు ఆడుతున్నారు.

వరుణదేవుడు పెట్టిన పరీక్షల్ని తట్టుకోలేక తల్లడిల్లుతున్న రైతులు.. ఇటు నకిలీ గాళ్ల చేతుల్లో చిక్కి దగా పడుతున్నారు. నల్గొండలో 70 లక్షల విలువైన 25 క్వింటాళ్ల నకిలీ విత్తనాల్ని సీజ్ చేశారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..