AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS POLICE: ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా వస్తున్న కార్లు.. ఆపి తనిఖీ చేయగా బయటపడ్డ భాగోతం!

అక్రమంగా డ్రగ్స్‌ తరలిస్తున్న ఓ ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 1.115 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు మహారాష్ట్రలో డ్రగ్స్‌ తయారీ చేసి తెలంగాణలో తాటికల్లు అమ్మకదారులకు విక్రస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిలో ఒకరు నిజామాబాద్‌కు చెందిన వారు కాగా నలుగురు కరీంనగర్ వాసులు ఉన్నారు.

TS POLICE: ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా వస్తున్న కార్లు.. ఆపి తనిఖీ చేయగా బయటపడ్డ భాగోతం!
Ts Police
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 22, 2025 | 8:18 PM

Share

మాదక ద్రవ్య నియంత్రణ శాఖ, ఎక్సైజ్ శాఖ పోలీసుల నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ప్రమాదకర డ్రగ్స్ తరలిస్తోన్న ఐదుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. నిర్మల్‌ జిల్లా వద్ద నేషనల్‌ హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు కార్లలో ప్రమాదకర డ్రగ్స్ లభించాయి. దీంతో డ్రగ్స్‌ తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 1.115 కిలోల అల్ప్రాజోలం, రెండు ఎర్టిగా కార్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం డ్రగ్స్‌ విలువ రూ. 52 లక్షలుగా ఉండొచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో డ్రైవర్ బసపల్లి రామ గౌడ్ (45) నిజామాబాద్‌కు చెందినవాడు కాగా.. మిగిలిన నలుగురు బుర్ర రమేష్ (36), కొట్టగిరి రాజం (59), ఎల్లందుల శ్రీనివాస్ (44), బుర్ర రాజశేఖర్ (34) కరీంనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా తాటికల్లు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తారని పోలీసులు తెలిపారు.

కాగా వీరంగా మహారాష్ట్రలోని థానే జిల్లా నింబవాలి గ్రామంలో రహస్యంగా మాదక ద్రవ్యాలను తయారు చేసి.. తెలంగాణలో తాటికల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలం వంటి ప్రమాదకర డ్రగ్స్‌ను ఉపయోగించి నకిలీ తాటికల్లు తయారు చేసి మార్కెట్‌లో విక్రయించడమే వీళ్ల వ్యాపారం అని పోలీసులు తెలిపారు. అయితే నిజామాబాద్‌కు చెందిన రామ గౌడ్ అనే వ్యక్తి 2024 జనవరిలోనూ ఇదే తరహా డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడని… జైలు నుండి విడుదలైన తర్వాత అతను కొత్తగా గ్యాంగ్ ఏర్పాటు చేసి.. మరోసారి తన దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ గ్యాంగ్‌ సరఫరా చేసే క్లోరల్ హైడ్రేట్‌ను నిద్రలేమి, ఆందోళన తగ్గించడానికి ఉపయోగిస్తారు. అల్ప్రాజోలం అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యం. దీన్ని ఎక్కువగా వాడితే కిడ్నీ, కాలేయ సమస్యలతో పాటు మరణం కూడా సంభవించవచ్చని అధికారులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాలు అనేక కుటుంబాలను దెబ్బతీస్తున్నాయని.. యువత, విద్యార్థులు ఇలాంటి చెడు అలవాట్లు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని TSNAB అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా డ్రగ్స్ సంబంధిత అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే 8712671111 నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..