Cyclone Michaung: మిచౌంగ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వచ్చే 2 రోజులు కుండపోత వర్షాలు.. ఆ జిల్లాలకు.!
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రా తీర ప్రాంతం ఆనుకొని నెల్లూరు నుంచి బందరువైపు సాగుతున్న మిగ్ జాం తుఫాను.. ప్రస్తుతం బాపట్ల సమీపం తీరాన్ని తాకింది. అలాగే మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రా తీర ప్రాంతం ఆనుకొని నెల్లూరు నుంచి బందరువైపు సాగుతున్న మిగ్ జాం తుఫాను.. ప్రస్తుతం బాపట్ల సమీపం తీరాన్ని తాకింది. అలాగే మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అటు మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నగరంలో తెల్లవారుజామున ఈదురు గాల్లులతో కూడిన వర్షం కురిసింది. ఓ వైపు చలి మరోవైపు వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున హయత్ నగర్, వనస్థలిపురం, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, మెహదీపట్నం, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక రెండు రోజులు పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.
దక్షిణ తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ఆ ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఈ నేపధ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
ప్రస్తుతానికి బాపట్ల, మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్.. మధ్యాహ్ననికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దాని ప్రభావంతో మంగళవారం హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. అలాగే రేపు కూడా హైదరాబాద్‌తో పాటు ఈశాన్య, ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి.




