CM KCR Review: కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదు.. స్వీయ నియంత్రణతో పండుగలు జరుపుకోండిః కేసీఆర్

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM KCR Review: కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదు..  స్వీయ నియంత్రణతో పండుగలు జరుపుకోండిః కేసీఆర్
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 09, 2022 | 7:04 PM

 CM KCR Review on Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. కరోనా కట్టడిలో భాగంగా స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదని ప్రజలకు సీఎం భరోసా ఇచ్చారు. అయితే, అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం అన్నారు.

ముఖ్యంగా వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దంగా వుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా వున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

Read Also….  PM Modi Review: కొవిడ్ విజృంభణ నేఫథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం.. వారికి వర్క్ ఫ్రం హోమ్!