Congress Rachabanda: కాంగ్రెస్‌లో రచ్చ రాజేసిన రచ్చబండ.. భగ్గుమన్న వర్గ విభేదాలు.. గుర్రుగా ఉన్న సీనియర్లు!
ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం.. కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతోంది. పార్టీలో వర్గపోరు, విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు.
Telangana Congress Rachabanda at Erravelli: ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం.. కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతోంది. పార్టీలో వర్గపోరు, విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో CM కేసీఆర్ దత్తత గ్రామం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో రచ్చబండ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా కార్యక్రమం తలపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టేముందు ముఖ్యనేతలతో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దీనిపై సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు. ముఖ్యంగా వీ.హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, తనకు సమాచారం లేకుండా తన ఇలాకాలో రచ్చబండ ఏంటని ప్రశ్నిస్తున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అంతేకాదు ఆ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణలో పార్టీకి నష్టమని.. దీనిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తాననని స్పష్టం చేశారు. కాగా, జగ్గారెడ్డిని సీనియర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిందంట్లో తప్పేంటన్నారు సీనియర్ నేత వీ. హనుమంతరావు. సమాచారం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నపుడు పార్టీలో అందరితో చర్చించాలి కదా అని వీహెచ్ ప్రశ్నించారు. ఈ ఇష్యూపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో మాట్లాడుతానంటున్నారు. మరోవైపు, పీసీసీ అధ్యక్షుడికి సొంత పార్టీలోనే మద్దతు లేదని MLC యాదవరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తమ ఉనికిని కాపాడుకునేందుకే రచ్చబండ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వల్లే పోలీసులు అనుమతి ఇవ్వలేదని యాదవరెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, పీసీసీ చేపట్టిన చలో ఎర్రవెల్లి కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. భారీ బలగాలను మోహరించారు. రాజీవ్ రహదారిపై వంటిమామిడి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అటు ఎర్రవెల్లి రచ్చబండకు అనుమతి ఇవ్వకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ వీధి నాటకాలు అడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి అని చెప్పలేదని మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టాల్సిన భాద్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీ లాగా పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు.
మరోవైపు, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎర్రవల్లికి వెళ్లి తీరుతానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెప్పినట్లే మధ్యాహ్నం 2 గంటలకు రచ్చబండ నిర్వహిస్తానని తెలిపారు. ఎర్రవల్లి గ్రామం ఏమన్నా నిషేధిత ప్రాంతమా అని నిలదీశారు. ఎందుకు తమను రచ్చబండ నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కుమ్ముక్కు రాజకీయాలను ప్రజల్లో ఎండ గడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Read Also…. Bandi Sanjay Deeksha: బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష.. ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని డిమాండ్