KVP: వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావడంపై క్లారిటీ ఇచ్చిన కేవీపీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైయస్ విజయమ్మ
YSR – KVP Ramachandra rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైయస్ విజయమ్మ తలపెట్టిన వైయస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టత నిచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కొంచెం సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. వైయస్సార్ అందరికి కావాల్సిన వ్యక్తి అని పేర్కొన్నారు. “నాకు విజయమ్మ ఫోన్ చేసి ఆత్మీయ సమ్మేళనం గురించి ఆహ్వానించారు. ఆత్మీయ సమ్మేళనానికి నేను కూడా వెళ్తున్నా” అని పేర్కొన్నారు.
కాగా, ఈ సాయంత్రం ఐదు గంటలకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలోని HICC లోని నోవాటెల్ లో జరుగబోతోంది. అప్పట్లో వైఎస్ తో కలిసి పని చేసిన నాయకులు, అధికారులు, జర్నలిస్టులులకు వైయస్ విజయమ్మ సభకు రావాలంటూ ఆహ్వానాలను ఇప్పటికే పంపించారు. అటు, తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మందికి ఆహ్వానాలు అందాయి. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా విజయమ్మ చేసిన ఫోన్ ఆహ్వానం మేరకు సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సాయంత్రం నోవాటెల్‌లో జరిగే ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమందిని ఆహ్వానించారు విజయమ్మ. అయితే ఈ సంస్మరణ సభకు ఎవరెవరు హాజరవుతారు..ఎవరు డుమ్మా కొడతారన్న దానిపైనే సస్పెన్స్ నెలకొంది. అప్పటి వైయస్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు, సన్నిహితంగా ఉండే నేతలు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ లు, టాలీవుడ్ పెద్దలకు విజయమ్మ ఆహ్వానాలు పంపించారు.
అయితే, వైయస్ విజయమ్మ తన కూతురు వైయస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకే ఈ సంస్మరణ సభకి పూనుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ సంస్మరణ సభ ప్లాన్ చేసింది.. ఎవర ఎవరికి ఆహ్వానాలు అందించాలి అన్నది అంతా ప్రశాంత్ కిషర్ వ్యూహంలో భాగమని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు, ఈ సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగబోతోన్న వైయస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read also: Pawan Kalyan: బర్త్ డే వేళ పవన్‌కు వెళ్లువెత్తుతోన్న ప్రముఖుల శుభాకాంక్షలు.. గవర్నర్ ప్రత్యేక సందేశం