AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Caste Census: తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం.. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కుల గణనపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రావటంతో ఆ దిశగా అడుగులు వేసింది. బీసీ కుల గణన తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. దీనికి బీఆర్ఎస్ పార్టీతో సహా ఏకగ్రీవంగా అన్నిపార్టీల సభ్యులు మద్దతు తెలిపారు.

Caste Census: తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం.. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బీఆర్ఎస్
Caste Census Resolution
Balaraju Goud
|

Updated on: Feb 16, 2024 | 7:21 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కుల గణనపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రావటంతో ఆ దిశగా అడుగులు వేసింది. బీసీ కుల గణన తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. దీనికి బీఆర్ఎస్ పార్టీతో సహా ఏకగ్రీవంగా అన్నిపార్టీల సభ్యులు మద్దతు తెలిపారు.

కులగణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలు అంశాలను లెవనెత్తారు. తీర్మానంపై బీఆర్ ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కుల గణనపై తీర్మానం చేయడమే కాకుండా చట్టం చేయాలన్నారు గంగుల. అసెంబ్లీలో బీసీ కులగ‌ణ‌న తీర్మానం ప్రవేశ‌పెట్టడం దేశ చ‌రిత్రలోనే చారిత్రాత్మకం అని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగ‌త‌ల‌పై స‌ర్వే నిర్వహిస్తామన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని, బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుందన్నారు. మాకు రాజకీయ దురుద్దేశాలు లేవు.. కులగణనపై అనుమానాలొద్దన్నారు సీఎం రేవంత్‌. సమగ్ర సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రప్రభుత్వం బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలన్నారు మాజీమంత్రి కేటీఆర్. బీసీ కులగణనకు చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్‌ అయినా వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్‌.

వాస్తవానికి.. కులగణన.. దేశంలో ఒక ప్రధాన డిమాండ్‌.. ఎప్పటినుంచో దేశ రాజకీయాల్లో నానుతున్న అంశం.. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. సమస్య సమస్యగానే ఉండిపోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్రం ఇప్పటివరకు ఏడు సార్లు జనాభా గణనలను నిర్వహించింది. అయితే.. కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన డేటా మాత్రమే వెల్లడయ్యేది. బీసీ జనాభా ఎంతనేది అంతుచిక్కని రహస్యంగా ఉండిపోతోంది. అయితే.. చరిత్రలో ఎప్పుడూ కులగణన చేయలేదు. ఈ క్రమంలోనే.. కొన్నేళ్లుగా కులగణనకు బీసీ వర్గాల నుంచి డిమాండ్‌ వ్యక్తం అవుతోంది.

ఎట్టకేలకు.. నితీష్‌కుమార్‌ సారథ్యంలోని బిహార్‌ సర్కార్‌.. ప్రతిష్టాత్మక కులగణనకు గతేడాది శ్రీకారం చుట్టింది. అంతే.. బీహార్‌ ప్రభుత్వ నిర్ణయంతో అన్ని రాష్ట్రాల్లోనూ కులగణనకు అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణన చేయనున్నట్లు ప్రకటించి.. ఆ మేరకు అడుగులు వేసింది. దాదాపుగా ఏపీలో కులగణన పూర్తైనట్లు.. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రకటించారు.

తెలంగాణ సర్కార్‌ కేవలం.. అసెంబ్లీ తీర్మానంతోనే కాకుండా.. కాలపరిమితితో కులగణాంకాలు పూర్తి చేయాలంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి.. బిహార్‌, ఏపీ తర్వాత.. దేశంలో కులగణన చేపట్టబోతున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…