Cotton Farmers: దగా పడుతున్న పత్తి రైతు.. నిండా ముంచుతున్న దళారులు..!
కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. తెల్ల బంగారంగా భావించే పత్తి పంట రైతుల పాలిట శాపంగా మారుతుంది. ఈ సంవత్సరం ఆశాజనకంగా వర్షాలు కురవకపోవడం, పండిన పంటను అమ్ముకుందామంటే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. తెల్ల బంగారంగా భావించే పత్తి పంట రైతుల పాలిట శాపంగా మారుతుంది. ఈ సంవత్సరం ఆశాజనకంగా వర్షాలు కురవకపోవడం, పండిన పంటను అమ్ముకుందామంటే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దళారులు చేస్తున్న మోసం పత్తి రైతుల పాలిట శాపంగా మారింది.
పత్తి రైతు కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈసారి సరైన వర్షాలు లేక ఒక ఎకరానికి సుమారుగా 6 క్వింటాల నుంచి 8 క్వింటాలు మాత్రమే వచ్చింది. పంట సాగు పెట్టుబడులకు ఇతరుల వద్ద అప్పు తెచ్చి రైతులు పంట సాగు చేశారు. అరకొరగా పండిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్‌లో ధర తగ్గడంతో పత్తి రైతుల ఆశలు అడి ఆశలవుతున్నాయి. దీనికి తోడు పత్తి వ్యాపారులు అందరు సిండికేట్‌గా మారడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ. 7,200 వేల పలికిన పత్తి ధర నేల చూపులు చూస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌కు పత్తి ఎక్కువ మొత్తంలో వస్తుండటంతో సిండికేట్‌గా ఏర్పడ్ వ్యాపారులు రేటును బాగా తగ్గించారు.
మధ్య ఉన్న దళారులు ఎక్కడికక్కడ సిండికేట్‌గా మారి ధరలు తగ్గించుతుండటంతో ప్రస్తుతం పత్తి రేటు క్వింటాల్ కు రూ. 6,500 వేల నుంచి రూ. 6,000 వరకు పడిపోయింది. గత సంవత్సరం ప్రారంభంలో రూ.10,000 వరకు పలికిన పత్తి ధర, ఈ సంవత్సరం ప్రారంభంలోనే రూ. 7,200 పలికింది. పత్తి కొనుగోలు దారులు మధ్య దళారులు ఏకమై పత్తి ధరను ఏకంగా రూ. 6,500, రూ. 6,000 తగ్గిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ సీసీఐలో అమ్ముకోని రైతులు ప్రైవేటు సిండికేట్ వ్యాపారుల దగ్గర తమ పత్తిని అమ్ముతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్ కల్, కోహిర్, మొగుడంపల్లి మండలంలో ప్రభుత్వ సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో అందోల్ నియోజకవర్గంలోని రాయికోడు, మునిపల్లి మండలాలకు ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, బొలెరో వాహనాలల్లో తీసుకెళ్లడంతో రవాణా ఖర్చులు అధిక భారం అవుతున్నాయి. కొంతమంది పెద్ద రైతులు అక్కడికి తీసుకెళ్తున్నారు. మరి కొంతమంది చిన్న సన్న కారు రైతులు సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్ల లేకపోతున్నారు. ఇదే అదునుగా చూసుకుని మధ్య దళారులు ఇష్టానుసారంగా రైతులను నట్టేట ముంచుతున్నారు.
పత్తి పంటను పండించాలంటే రైతులకు విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి. విత్తనాల సేకరణ, విత్తనాలు నాటడం, వ్యవసాయ కూలీల ఖర్చులు, పిచికారి మందులు లాంటివి కలిసి పత్తి రైతులకు ఎకరానికి సుమారుగా రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కానీ, ప్రైవేట్ వ్యాపారులు కల్పిస్తున్న ధరలు కానీ రైతులకు ఏ విధంగా మేలు చేర్చు విధంగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సంబంధిత అధికారులు స్పందించి జహీరాబాద్ నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో కూడా సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధర చెల్లించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
