Telangana: నిత్య శ్రమజీవి.. నిండుగా దేశభక్తి.. స్ఫూర్తిగా నిలుస్తున్న సామాన్యుడు!
తిప్పర్తి మండల కేంద్రంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి.. జాతీయ గీతం పాడాలనే కోరిక కలిగిందని పాపయ్య చెబుతున్నాడు. అందుకోసం ఎంత పని ఉన్నా.. ఆ సమయానికి తిప్పర్తి కూడలికి జెండాను నేనే తెచ్చి జాతీయ గీతం పాడినంతసేపు అక్కడే ఉండి ఆ తరువాత నా పని చూసుకుంటానని అంటున్నాడు.

విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకు పాఠశాలల్లో ప్రతి రోజు జాతీయ గీతాలాపన చేస్తూ ఉండడం చూసి ఉంటాాం.. కానీ నిరక్షరాస్యుడైన వృద్ధుడు ప్రతి రోజు గ్రామంలో జాతీయ గీతాలాపన చేస్తూ దేశభక్తిని చాటుతున్నాడు. సిరి సంపదలు లేకున్నా దేశభక్తిలో మిన్న అన్నట్లుగా రోజూ ఉదయం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జాతీయ జెండాను చేత పట్టి గీతాలాపన ఆ వృద్ధుడు ఎవరో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన జనగణమన ఉత్సవ సమితి నాలుగేళ్ల క్రితం నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతిరోజూ చౌరస్తాలు, వ్యాపార కేంద్రాల్లో నిర్వహిస్తున్న జాతీయ గీతాలాపన ప్రజల నుంచి అపూర్వ స్పందన దక్కించుకుంది. దీంతో నల్లగొండ పట్టణంతోపాటు సమీప మండల కేంద్రాల్లో కూడా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో 2022 జనవరి 27వ తేదీ నుంచి నిత్య జాతీయ గీతాలాపన నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేసి జనగణమన ఆలపిస్తున్నారు.
తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని నూకల వారిగూడం గ్రామానికి చెందిన నూకల పాపయ్య నిత్యం కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తూ.. జీవితాన్ని గడుపుతున్నాడు. 72 ఏళ్ల పాపయ్య మాత్రం తనలోని దేశభక్తిని గొప్పగా చాటుతున్నాడు. ప్రతిరోజు ఉదయం 8.30 గంటలు కాగానే కూరగాయల సంచి పక్కన పెట్టి.. జాతీయ జెండా పట్టుకుని కూడలికి వచ్చి జనగణమన ఆలాపిస్తున్నాడు. ఆ తర్వాత తన పని చూసుకుంటాడు. మధ్యాహ్నం వేళ గేదెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాపయ్య ప్రతి రోజూ జాతీయ గీతం ఆలపించడాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తుంటారు.
జాతీయ గీతం పాడాలని కోరిక…
తిప్పర్తి మండల కేంద్రంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి.. జాతీయ గీతం పాడాలనే కోరిక కలిగిందని పాపయ్య చెబుతున్నాడు. అందుకోసం ఎంత పని ఉన్నా.. ఆ సమయానికి తిప్పర్తి కూడలికి జెండాను నేనే తెచ్చి జాతీయ గీతం పాడినంతసేపు అక్కడే ఉండి ఆ తరువాత నా పని చూసుకుంటానని అంటున్నాడు. రోజూ ఉదయం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు పాపయ్య.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
