AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి కాదు.. కానీ కుటుంబ సభ్యుడే..! మళ్లీ పుట్టాలి కాలభైరవ.. ఇదో కన్నీటి కథ..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామంలో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. కాలభైరవ అనే శునకాన్ని కుటుంబ సభ్యుడిలా పెంచుకున్న రైతు సామిడి మహేందర్ రెడ్డి కుటుంబం, అది ప్రమాదంలో మృతి చెందడంతో ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించింది. మూడు రోజుల కార్యక్రమాలు కూడా పూర్తి చేసి తమ ప్రేమాభిమానాలను చాటుకుంది.

మనిషి కాదు.. కానీ కుటుంబ సభ్యుడే..! మళ్లీ పుట్టాలి కాలభైరవ.. ఇదో కన్నీటి కథ..
Family Performs Traditional Last Rites for Pet Dog
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 5:59 PM

Share

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో.. జనం మనుషులు కంటే మూగజీవాలతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. పెంపుడు జంతువులే కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసిపోతున్నాయి. అలాంటి పెంపుడు కుక్క చనిపోతే ఆ కుటుంబం తల్లడిల్లింది. కుటుంబ సభ్యుడిగా భావించి పెంచుకున్న ఆ శునకం చనిపోవడంతో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..నల్గొండ జిల్లా చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామానికి చెందిన రైతు సామిడి మహేందర్ రెడ్డికి పెంపుడు జంతువులు అంటే చాల ఇష్టం. రైతుగా మహేందర్ రెడ్డి ఇంటి నుండి వ్యవసాయ పొలం.. వద్దకు రాకపోకలు సాగించేవాడు. తనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఓ శునకాన్ని పెంచుకున్నాడు. ఏళ్ల తరబడి కుటుంబంతో కలిసి జీవించిన ఆ పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందింది. దాని పిల్ల కాలభైరవను కుటుంబ సభ్యుడిలా పెంచుకున్నాడు. గతంలో కాలభైరవను కుక్కలు తరమడంతో తన వ్యవసాయ బావిలో పడిపోయింది. దీంతో తల్లడిల్లిన మహేందర్ రెడ్డి క్రేన్, స్థానికులు సహాయంతో కాలభైరవుడినీ బయటికి తీశాడు.

మహేందర్ రెడ్డికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నాడు. ఈ కాలభైరవుడిని మహేందర్ రెడ్డి కుటుంబం.. ఇంట్లో సభ్యుడిగా పెంచు కుంటున్నారు. అయితే ట్రాక్టర్ ఢీకొని కాలభైరవు మృతి చెందింది. దీంతో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యుడి మాదిరిగానే కాలభైరవుడి మృత దేహానికి పూలమాలలు వేసి, ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి కుటుంబ సభ్యుడిలా వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మూడు రోజుల కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు.

“ఇది మాకు కేవలం పెంపుడు జంతువు కాదు.. మా కుటుంబంలో ఒక సభ్యుడు. మా సంతోషాల్లో, కష్టాల్లో మాతోనే ఉంది. దాని మరణాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాలభైరవ మృతి గ్రామస్తులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన కూడా మనుషులు, జంతువుల మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us