AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ అంశాలపై క్లారిటీ రానుందా..

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా.. రెండు రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలోనే మకాం వేశారు. ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి‎తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు.

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఆ అంశాలపై క్లారిటీ రానుందా..
Cm Revanth Reddy Delhi Tour
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 21, 2024 | 9:43 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా.. రెండు రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలోనే మకాం వేశారు. ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి‎తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‎లో ప్రకటించిన రెండు లక్షల ఋణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనేక విషయాలను వారికి వివరించనున్నారు. త్వరలో రాహుల్ గాంధీతో సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయనను ఆహ్వానించే అవకాశముంది. అదేవిధంగా పీసీసి అధ్యక్ష పదవి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకో వైపు నామినేటెడ్ పదవులుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు.

ముఖ్యంగా రెండు రోజుల పర్యటనలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే 35 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన సీఎం ఇంకో 15నుండి 20 మందికి ఇవ్వాలని భావిస్తున్నారు. కష్టపడ్డ వారికి కాకుండా భజన చేసే నేతలకు పదవులు ఇచ్చారని విమర్శల నేపథ్యంలో వాటిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు జూలై 23నుండి శాసన మండలి, అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశం కూడా తెరపైకి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఎవరికి వారే అన్నట్లుగా పార్టీలో వ్యవహరిస్తున్న తీరు, మరొక వైపు చేరికల విషయంలో తమ ప్రమేయం లేకుండా చేర్చుకుంటున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకో వైపు తమకు పదవులు కావాలని పీసీసి అధ్యక్షుడి ప్రమేయం లేకుండానే అగ్రనేతలను ప్రసన్నం చేసుకోవడంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

ఆశావహులు పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతో అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారని తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా తరచూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వారికి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా గాంధీభవన్‎లో చర్చ జరుగుతోంది. ఇలాంటివాటిపై క్లారిటీ ఇచ్చేందుకు సీఎం రేవంత్ ఢిల్లీలో అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఈ సారైనా కొత్త పీసీసి అధ్యక్షుడు, అదేవిధంగా నామినేటెడ్ పోస్ట్‎లలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా హై కమాండ్‎తో ఆమోద ముద్ర వేయిస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటూ మంత్రి వర్గం విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. లేక అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఈ ప్రక్రియ చెపడతారా అన్నదానిపై కూడా కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..