CM Revanth Reddy: మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మియాపూర్ భూములపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో భూములను కాపాడే ప్రయత్నం జరగలేదని.. తాము అధికారంలోకి వచ్చాక బలమైన వాదనలు వినిపించామన్నారు. అవసరమైతే మియాపూర్ భూములు అమ్మి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తా మన్నారు సీఎం రేవంత్‌రెడ్డి

మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మియాపూర్‌లో 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ధరణి రికార్డులను తారుమారు చేసి భూములను ఆక్రమించుకోవాలని చూశారని విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే భూ ఆక్రమణలపై పోరాటం చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. మియాపూర్ భూముల విషయంలో గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా బలమైన వాదనలు వినిపించలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై సమర్థంగా వాదనలు వినిపించామని పేర్కొన్నారు. మియాపూర్ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే మియాపూర్ భూములను విక్రయించి, ఆ నిధులను విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల ద్వారా వచ్చే నిధులను పేదల ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.
ఐఎంజీ భూముల అంశంలోనూ తమ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని చెప్పారు. మంచిరేవులలోని 143 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. ఈ అంశంపై పోరాటం చేసి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అందులో 50 ఎకరాలను యంగ్ ఇండియా స్కూల్‌కు కేటాయించినట్లు వెల్లడించారు. భూపాలపల్లిలోనూ 104 ఎకరాల భూమిని తిరిగి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
గత మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అటవీ పరిధిలో ఉన్న భూములను అటవీ శాఖకు, రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను రెవెన్యూ శాఖకు అప్పగిస్తామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న భూములను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు.
అవసరమైన చోట భూములను విక్రయించి, ఆ నిధులను సంక్షేమ పథకాల అమలుకు వినియోగిస్తామని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మియాపూర్ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు ఉన్నాయా లేదా అనే అంశంపై హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే నిర్వహిస్తారని తెలిపారు.
భూ కబ్జాలకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని.. ఇందులో బీఆర్ఎస్ నేతల బంధువులకు సంబంధించిన భూ ఆక్రమణలు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో విచారణ జరగకుండా హరీశ్‌రావు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లోనూ భూముల సర్వేలు నిర్వహిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. కేసీఆర్ ఫాంహౌస్ చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామాల్లో సర్వేలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 388 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని, మరో 345 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని పేర్కొన్నారు. మిగిలిన భూములను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా భూ ఆక్రమణలను మానుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. ఎర్రవల్లి సమీపంలో తెలంగాణ అమరవీరుల కాలనీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి పేరుతో ఈ కాలనీని నిర్మించనున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
