Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్ ఎలా ఉంది..?
ఫలక్‌నుమా దాస్, ధమ్కీ తర్వాత విశ్వక్ సేన్ తెరకెక్కించిన చిత్రం కల్ట్. పైగా ఇది ఇండియాలోనే మొదటి స్లాషర్ థ్రిల్లర్ సినిమా. హింసకు ఏ మాత్రం కొదవలేకుండా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? మెప్పించిందా లేదా..? అసలు స్లాషర్ థ్రిల్లర్ అంటే ఏంటి..? ఇవన్నీ పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: కల్ట్
నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, తారక్ పొన్నప్ప, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
ఎడిటర్: రవితేజ గిరిజాల
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫర్: అరవింద్ విశ్వనాథన్
నిర్మాత: సందీప్ కాకరాల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: విశ్వక్ సేన్
ఫలక్‌నుమా దాస్, ధమ్కీ తర్వాత విశ్వక్ సేన్ తెరకెక్కించిన చిత్రం కల్ట్. పైగా ఇది ఇండియాలోనే మొదటి స్లాషర్ థ్రిల్లర్ సినిమా. హింసకు ఏ మాత్రం కొదవలేకుండా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? మెప్పించిందా లేదా..? అసలు స్లాషర్ థ్రిల్లర్ అంటే ఏంటి..? ఇవన్నీ పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎక్కడ తప్పు జరిగినా వెంటనే వాలిపోతుంటాడు. గోవాలో ఒక ఐసోలేటెడ్ ఐలాండ్‌లో జరిగిన భారీ రేవ్ పార్టీకి 300 మందికి పైగా యువతీ యువకులు హాజరవుతారు. అయితే ఊహించని విధంగా అక్కడ ముసుగులు ధరించిన కొందరు సైకోలు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, ల్యాండ్‌మైన్స్‌తో ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. లోపల ఉన్న 300 మంది యువతను ప్రాణాలతో ఆడుకునే ఒక క్రూరమైన, ప్రాణాంతకమైన సర్వైవల్ గేమ్‌లోకి లాగుతారు. ఈ నరమేధం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, వారి మోటివ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ యువతను కాపాడటానికి, ఈ భయంకరమైన ఆటను ముగించడానికి సంకల్ప్ నాయక్ చేసిన పోరాటమే ఈ చిత్ర ముఖ్య కథాంశం.
కథనం:
గోవా నేపథ్యంగా ఒక బర్త్‌డే పార్టీతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.. మొదట్నుంచీ డ్రగ్స్, మందుతో నిండిపోతుంది స్క్రీన్ అంతా.. ఆ తర్వాత రక్తం కూడా. అనూహ్యంగా ఆ పార్టీ కాస్తా ప్రాణాంతకమైన ఆటకు దారితీసి, అందులో ఇరుక్కుపోయిన వాళ్ళకు సర్వైవల్ డ్రామాగా మారుతుంది. స్క్రీన్ ప్లే చాలా వేగంగా సాగడం ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం. ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఒక సీన్ నుంచి మరో సీన్‌కు చాలా వేగంగా కథను నడిపించారు. కాకపోతే, సినిమా మొదలైన తొలి 25 నిమిషాలు కాస్త నీరసంగా అనిపిస్తుంది. పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకుడికి కాస్త అసహనం కలుగుతుంది. సరిగ్గా విరామానికి ముందు, అంటే సుమారు 45 తర్వాత విశ్వక్ సేన్ పాత్ర ప్రవేశిస్తుంది. ఆయన ఎంట్రీ సీన్ మాత్రం చాలా అద్భుతంగా పండింది. అక్కడి నుంచి సినిమా వేగం పుంజుకుని పూర్తిగా మరో స్థాయికి వెళ్తుంది. ‘హిట్ 3’ని గుర్తుకుతెచ్చేలా అత్యంత భయంకరమైన యాక్షన్, రక్తపాతం, హింసతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా నడుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ప్రాణాలను దక్కించుకునే పోరాటం చుట్టూనే సాగుతుంది, కానీ అవే సీన్లు మళ్లీ మళ్లీ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పాత్రల గతాన్ని వివరించే నేపథ్య కథను ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుని ఉండాల్సింది. భావోద్వేగాలను పండించే సన్నివేశాలు ఆడియన్స్ మనసుకు సరిగ్గా హత్తుకోవు. మొత్తంగా చూసుకుంటే, కేవలం భీకరమైన పోరాటాలు, వయొలెన్స్ మాత్రమే ఈ సినిమాను చివరి వరకు నిలబెట్టాయి. హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు కల్ట్ సినిమా కూడా బాగానే నచ్చుతుంది. చివర్లో సీక్వెల్ హింట్ కూడా ఇచ్చారు.
నటీనటులు:
విశ్వక్ సేన్ నటుడిగా ఆకట్టుకున్నాడు. తనలోని ఈజ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది.. పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. గాయత్రి భరద్వాజ్ గ్లామర్ షోతో పాటు పర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. తారక్ పొన్నప్ప నటన బాగుంది. ముగ్గురు కొత్త అబ్బాయిలు కూడా చాలా బాగా నటించారు. సీనియర్ నటులు శ్రీకాంత్ అయ్యంగార్, మురళీ శర్మ మెప్పించారు.. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
రవి బస్రూర్ మ్యూజిక్ బాగుంది.. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోరే కీలకం. రవితేజ గిరిజాల ఎడిటింగ్ అక్కడక్కడా స్లో అయింది.. కొన్ని సీన్స్‌లో బూతులు కూడా అలాగే వచ్చేసాయి. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నటుడిగానే కాదు దర్శకుడిగానూ విశ్వక్ సేన్ బాగానే ఆకట్టుకున్నాడు. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు కానీ మనం ముందుగా చెప్పినట్లు సర్వైవల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు మాత్రం ఓ మోస్తరుగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ థ్రిల్ పంచుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా కల్ట్.. రూత్ లెస్ సర్వైవల్ థ్రిల్లర్..!
