జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్.. 007 గూఢచారిగా బాట్ మ్యాన్!
బ్యాట్‌మ్యాన్‌గా అలరించిన రాబర్ట్ ప్యాటిన్సన్ కి జేమ్స్ బాండ్‌గా నటించే అవకాశం దక్కింది. 2021లో ‘నో టైమ్ టు డై’ తో డేనియల్ క్రెయిగ్ 007 పాత్రకు గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి కొత్త బాండ్ ఎవరనే విషయంపై రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు స్టార్ హీరోల పేర్లు వినిపించగా ఈసారి కొత్త నటుడికే అవకాశం ఇస్తారని వార్తలు సందడి చేసాయి. చివరకు బాండ్ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ రాబర్ట్ ప్యాటిన్సన్ ను ఎంపిక చేసారు. .
జేమ్స్ బాండ్ పాత్ర రావడంపై రాబర్ట్ ప్యాటిన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘సినిమా ప్రపంచంలో జేమ్స్ బాండ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్రల్లో ఒకటి. అలాంటి 007 పాత్రను పోషించే అవకాశం రావడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. ఈ పాత్ర నా కల అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. ఈ కొత్త ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు. డేనియల్ క్రెయిగ్ తర్వాత 007గా ఎవరు కనిపిస్తారనే చర్చ చాలా కాలం కొనసాగింది. ఈ రేసులో కాలమ్ టర్నర్, జోష్ ఓ కానర్, జాక్ లోడెన్, నికోలస్ హౌల్ట్ వంటి నటుల పేర్లు వినిపించాయి. రాబర్ట్ ప్యాటిన్సన్ పేరు కూడా ఇటీవలే ఈ జాబితాలో చేరింది.
ఆయన ఈ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్‌లో పాల్గొన్నట్లు వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 40 ఏళ్ల ప్యాటిన్సన్ ఇప్పటికే మూడు హాలీవుడ్ ఫ్రాంచైజీలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ‘హ్యారీ పోటర్’ సినిమాలో సెడ్రిక్ డిగరీగా కనిపించారు. ‘ట్విలైట్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్త యువతకు దగ్గరయ్యారు. ‘ది బ్యాట్‌మ్యాన్’లో బ్రూస్ వేన్‌గా అదరగొట్టారు. ఇప్పుడు అదే స్టార్‌డమ్‌తో జేమ్స్ బాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్యాటిన్సన్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలకే పరిమితం కాలేదు. విభిన్న కథలతో తెరకెక్కిన ‘గుడ్ టైమ్’, ‘ది లైట్‌హౌస్’, ‘మిక్కీ 17’ వంటి చిత్రాల్లోనూ నటించి తనలోని వైవిధ్యమైన నటుడిని పరిచయం చేశారు.
1962లో ‘డాక్టర్ నో’ తో జేమ్స్ బాండ్ ప్రయాణం మొదలై 60 ఏళ్లకు పైగా ఆ పాత్ర ప్రపంచ సినీ అభిమానులను అలరిస్తోంది. సీన్ కానరీ నుంచి డేనియల్ క్రెయిగ్ వరకు ఆరుగురు 007 పాత్రలో నటించారు. ఇప్పుడు ఏడో నటుడిగా రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక కావడం అభిమానుల్ని అలరిస్తోంది.
ఫ్రాంచైజీ నిర్వహణలోనూ భారీ మార్పులు జరిగాయి. 2022లో అమెజాన్ సంస్థ 8.5 బిలియన్ డాలర్లకు ఎంజీఎం స్టూడియోస్‌ను కొనుగోలు చేసింది. బాండ్ సినిమాల క్రియేటివ్ కంట్రోల్ అమెజాన్ ఎంజీఎం చేతుల్లోకి వెళ్లింది. దీంతో కొత్త బాండ్ ఎంపిక, సినిమా రూపకల్పన బాధ్యత కొత్త బృందం చూస్తోంది. జేమ్స్ బాండ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఒక్క ‘నో టైమ్ టు డై’ సినిమానే 774 మిలియన్ డాలర్లు రాబట్టింది. కొత్త బాండ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
కథ రాయనున్న పీకీ బ్లైండర్స్ సృష్టికర్త!
కొత్త జేమ్స్ బాండ్ సినిమాకు ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డ్యూన్’, ‘అరైవల్’ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్యాటిన్సన్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ పాత్ర కోసం ఎంతో మంది ప్రతిభావంతులు పోటీపడ్డా రాబర్ట్ ప్యాటిన్సన్‌ను కొత్త జేమ్స్ బాండ్‌గా స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉంది. బాండ్‌కు ఉండాల్సిన ప్రత్యేక ఆకర్షణతో పాటు సరికొత్త శైలి అతనిలో ఉంద’ ని విల్లెన్యూవ్ తెలిపారు. ఇక ఈ సినిమాకు ‘పీకీ బ్లైండర్స్’ సృష్టికర్త స్టీవెన్ నైట్ కథ అందిస్తే అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాతలుగా ఉన్నారు.