AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జైన మతస్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. మైనార్టీ సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గంగా జమునా తెహజీబ్‌కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు సుఖ:శాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Telangana: జైన మతస్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. మైనార్టీ సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
CM KCR
Aravind B
|

Updated on: May 23, 2023 | 2:34 AM

Share

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గంగా జమునా తెహజీబ్‌కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు సుఖ:శాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన జైన మత పెద్దలు.. తమ మైనార్టీ హక్కులను గుర్తిస్తూ, మైనార్టీ కమిషన్‌లో ప్రాతినిధ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రకృతి అందించిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో 75ఏళ్లుగా దేశ పాలక వ్యవస్థ విఫలమైందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వ్యవసాయాధారిత భారతదేశంలో కేంద్ర పాలకులకు దార్శనికత లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, ప్రజలందరి సహకారంతో దేశవ్యాప్తంగా ఈ అభివృద్ధిని పరిచయం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాల స్థలాన్ని సీఎం కేటాయించారు. అలాగే మహావీర్ ఆసుపత్రి ఛైర్మన్, మత పెద్దల విజ్ఞప్తి మేరకు.. మసబ్ ట్యాంక్‌లో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ స్థలంలో ఉన్న మహావీర్ ఆసుపత్రికి ఉచితంగా లీజ్‌కు కేటాయించారు. గత పాలకుల హయాంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సమర్థంగా శాంతిభద్రతలను పటిష్ఠంగా కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్న సీఎం కేసీఆర్ పాలన రామరాజ్యాన్ని తలపిస్తున్నదని జైన మత సమాజ పెద్దలు ప్రశంసించారు. పారిశ్రామికాభివృద్ధి, వ్యాపార వాణిజ్య రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ విషయం వ్యాపార వర్గాలైన తమ అనుభవంలోకి స్వయంగా వచ్చిందన్నారు.

ఇదిలా ఉండగా ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎస్సీ బాలికల బాలికల విద్య, ఉన్నతికి భాగ్యరెడ్డి వర్మ పునాదులు వేశారని కొనియాడారు. ఎస్సీల సమగ్ర వికాసానికి మరెన్నో కార్యక్రమాలు రావాలని.. ఆ దిశగా భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..