తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్లియర్ పిక్చర్, ఉసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది...

  • Venkata Narayana
  • Publish Date - 9:55 pm, Fri, 26 February 21
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్లియర్ పిక్చర్, ఉసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవి రంగంలోకి దిగారు. ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీ పడుతున్నారురు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు.

ఇక్కడి వరకూ భాగానే ఉంది. అసలు సినిమా ఇప్పుడే మొదలుకానుంది. కోవిడ్‌ కారణంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో EVMకు బదులు ..బ్యాలెట్‌ పేపర్‌ ఉపయోగిస్తోంది ఎన్నికల కమిషన్‌. అయితే గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు, జనరల్‌ ఎలక్షన్స్‌కి తేడా ఉంది. జనరల్‌ ఎలక్షన్స్‌లో ఒక అభ్యర్థికి ఓటు వేస్తే….గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రియారిటీ వారీగా అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే ఈసారి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది, మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది బరిలో ఉన్నారు. అంటే EVM ద్వారా ఎన్నికలు నిర్వహిస్తేనే…4 నుంచి 6 ఈవీఎంల అవసరముంటుంది.

ఇక బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఒక్కో బ్యాలెట్‌లో సుమారు 30 మంది పేర్లు ఉండవచ్చు అనుకుంటే…ఈ లెక్కనా కనీసం 3 నుంచి 4 బ్యాలెట్‌ పేపర్ల అవసరం ఉండవచ్చు. అయితే ఓటర్లు గ్రాడ్యూయేట్సే అయినా…బ్యాలెట్‌ పేపర్‌లో ప్రియారిటీ వారీగా ఓటేయ్యాలంటే కాస్తా తికమక పడే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికల కమిషన్‌ దీనిపై త్వరలో ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ జోరుగా ప్రచారం నడిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఓటర్లకు విజ్ఞప్తులు పంపిస్తున్నారు. ఆరు ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పది లక్షలకు మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. టీఆర్ఎస్ అభ్యర్థుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు శ్రమిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

Read also : Covid-19 Guidelines: కోవిడ్-19 మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ