ఇందూరులో ఆగని బాల్య వివాహాలు.. ముక్కు పచ్చలారని చిన్నారులకు మూడు ముళ్ళ బంధం..!
బాల్య వివాహాలను అడ్డుకునేందుకు.. ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు భారం అనే తల్లిదండ్రుల ఆలోచన మారేలా ప్రభుత్వం క్షేత్రస్దాయిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. బాల్య వివాహం జరిగితే 1098 కి కాల్ చేయడం మరచిపోకండి..!
బాల్యానికి మూడు ముళ్లతో బంధిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లలు భారం అనుకంటున్నారో బాధ్యత తీరుతుందని భావిస్తున్నారో తెలియదు కానీ.. ముక్కు పచ్చలారిని చిన్నారులకు వయస్సు రాకముందే పెళ్లీళ్లు చేస్తున్నారు. మాంగళ్యమంటే అర్దం తెలియని వయస్సులోనే.. ఓ ఇంటి ఇల్లాలై పోతున్నారు బాలికలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా బాల్య వివాహాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలకు లెక్కేలేకుండా పోతోంది.
ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు పెరిగిపోతున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో ఇందూరు టాప్ లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ డివిజన్లలో బాల్య వివాహాలు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడిచిన ఏడాదిలో ఒక్క నిజామాబాద్ జిల్లాలో 34 బాల్య వివాహాలను చివరి క్షణాల్లో ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు.
పీటల మీద పెళ్లిళ్లను ఆపేస్తున్నప్పుడు.. తల్లిదండ్రులు వారి బంధువులు ఎదురుదాడికి దిగి అధికారులపైకి తిరిగబడుతున్నారు. అధికారులు వెళ్లేలోపు మరో ఐదు పెళ్లిళ్లు జరిగిపోయాయి. దీంతో ఆ ఐదుగురి కుటుంబాలతో పాటు పెళ్లి కొడుకులపై కేసులు పెట్టారు అధికారులు. నాలుగేళ్లలో సుమారు 106 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారికంగా అడ్డుకున్న బాల్య వివాహాలే ఈస్థాయిలో ఉంటే, అనధికారికంగా ఏ స్దాయిలో బాల్యానికి మూడు ముళ్లు వేశారో అర్దం చేసుకోవచ్చు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం వల్ల.. అనేక అనార్ధలు ఉన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులో గర్భం దాల్చితే ప్రాణ నష్టం జరిగే వీలుందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలతో బాధపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురిటిలో తల్లీబిడ్డలు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు..
బాల్య వివాహాలు గ్రామాల్లోనే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. నిరక్ష్యరాస్యుల్లోనే కాదు.. అక్షరాస్యులు సైతం ఈ తరహా పెళ్లిళ్లు గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు.. భారం దించుకునేందుకు చిన్న వయస్సులో బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్దాయిలో అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు. గత ఏడాది జిల్లాలో 34 పెళ్లిళ్లను అడ్డుకున్నామని చెప్పారు. పదో తరగతి పూర్తి కాకుండానే పెళ్లిళ్లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా చేసిన బాల్య వివాహాలకు లెక్కేలేకుండా పోయింది.
బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహాలు ప్రోత్సహించే వారితోపాటు వివాహం జరిపించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా, లేదంటే రెండూ విధించవచ్చంటున్నారు అధికారులు. బాల్య వివాహాలు జరగడానికి వరకట్నం కారణంగా కొందరు చెబుతుంటే, మరికొందరు పక్కింటి పిల్లలు ప్రేమ పేరుతో ఎవరితోనే వెళ్లిపోయారని తదితర కారణాలు చెబుతున్నట్లు అధికారులు అంటున్నారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..