Kishan Reddy: హుజూరాబాద్‌లో గెలిచేది కమలమే.. రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ పతనం ఖాయంః కిషన్‌రెడ్డి
రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ సూటికేసుల్లో హుజూరాబాద్‌కు కోట్లు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Kishan Reddy in Jana Ashirvada Yatra: రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ సూటికేసుల్లో హుజూరాబాద్‌కు కోట్లు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఅర్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కోట్లు ఖర్చుచేసినా హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర యాదాద్రి జిల్లా భువనగిరిలో కొనసాగింది. భువనగిరిలో గిరిజన మహిళా కార్యకర్తలతో కలిసి బైక్ రైడ్ చేశారు మంత్రి కిషన్ రెడ్డి. భువనగిరి పట్టణంలోని ఓ రేషన్ షాప్‌ను ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పేదలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో కుటుంబ, నియంత పార్టీ టీఆర్ఎస్ పాలనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రజలు నిజాం పాలన, ఎఐఎం తొత్తుగా ఉన్న టీఆర్ఎస్ ను బుద్ధి చెప్తారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. తొలిసారిగా మోదీ మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత పాటించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్న ఆయన.. భవిష్యత్తులో ఇద్దరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినా టీఆర్ఎస్‌లోనే చేరుతారని జోస్యం చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు .బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదన్నారు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని ప్రజలు తిప్పికొడుతారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.