Cyber Fraud: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..
పైగా ఇలాంటి మోసాల బారిన పడుతోన్న వారు ఏదో చదువుకోలేని వారనుకుంటే పొరబడినట్లే బీటెక్‌లు, ఎంటెక్‌లు వంటి టెక్నికల్ డిగ్రీలు చదివినవారితోపాటు సమాజంలో ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు కూడా మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఖమ్మంలో జరిగింది. వర్క్ ఫ్రం హోమ్...

మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు దారి దోపిడిలు, ఇళ్ల దోపిడీల గురించి విన్నాం కానీ ఇప్పుడు, సైబర్ దోపిడి గురించి వింటున్నాం. ప్రపంచంలో ఎక్కడ కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను ఎంచక్కా కాజేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా ప్రచారం కల్పిస్తోన్నా ఇలాంటి నేరాలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ఆన్‌లైన్ మోసాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
పైగా ఇలాంటి మోసాల బారిన పడుతోన్న వారు ఏదో చదువుకోలేని వారనుకుంటే పొరబడినట్లే బీటెక్‌లు, ఎంటెక్‌లు వంటి టెక్నికల్ డిగ్రీలు చదివినవారితోపాటు సమాజంలో ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు కూడా మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఖమ్మంలో జరిగింది. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు.
వివరాల్లోకి వెళితే.. ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ అనే యువతి ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఈ క్రమంలోనే నవ్యశ్రీకి ఈ నెల 2వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ‘వర్క్ ఫ్రమ్ హోం’ జాబ్ పేరుతో ఓ లింక్‌ను పంపించాడు. లింక్‌ను ఓపెన్ చేసి కొన్ని టాస్క్‌లు చేస్తే జీతం వస్తుందని నమ్మించారు. దీంతో నిజమే అనుకున్న నవ్యశ్రీ లింక్ ఓపెన్ చేసి వాల్లు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేసింది. అయితే ఇందుకోసం ముందుగా కొంత డబ్బు చెల్లించాలని, చెల్లించన దానికి ఎక్కువ మొత్తం తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు.
దీంతో వెనకా ముందు ఆలోచించని నవ్యశ్రీ.. తన అకౌంట్‌ను ఏడు దఫాలుగా మొత్తం రూ.91,100 పంపించింది. ఎంతకీ తిరిగి డబ్బులు చెల్లించకపోడంతో అనుమానం వచ్చి, తాను పంపిన డబ్బులు తిరిగి పంపాలని కోరింది. దీంతో అవతలి వ్యక్తి రూ.83 వేలు పన్ను చెల్లిస్తే సొమ్ము తిరిగి ఖాతాలోకి వస్తాయని సమాధానం ఇచ్చాడు. దీంతో తాను మోసపోయానని భావించిన బాధితురాలు అదే రోజు సైబర్ క్రైం 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం గురువారం స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
