Mulugu: సీతక్కకు చెక్ పెట్టేందుకు.. BRS నుంచి బరిలోకి ఊహించని అభ్యర్థి..!
MLA Seethakka: గులాబీ బాస్ ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా గురి పెట్టారా? కొరకరాని కొయ్యగా మారిన MLAకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారా? మాజీ నక్సలైట్ పై మరో మాజీ కామ్రేడ్ కూతురిని ప్రయోగించబోతున్నారా? బీఆర్‌ఎస్ అధినేత స్ట్రాటజీ ఏంటి? ఆ నియోజకవర్గంపైనే ప్రత్యేకంగా ఎందుకంత గురి? ఎవరిని బరిలోకి దించబోతున్నారు?
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. అన్ని పార్టీలు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే కసరత్తు ముమ్మరం చేశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల BRS ఎమ్మెల్యేలే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓరుగల్లుపై గులాబీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్. 11సీట్లూ మళ్లీ గెలుచుకుంటానన్న ధీమాతో ఉందాపార్టీ. ఓరుగల్లులో అధికారపార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న పదకొండు సీట్లు పోగా మిగిలిన ఒకే ఒక్క స్థానం ములుగు నియోజకవర్గం. ఇదే ఇప్పుడు BRS పార్టీకి టార్గెట్‌గా మారిందట. ములుగునుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అధికారపార్టీకి కంట్లో నలుసుగా మారారు. అందుకే ఈసారి ఎలాగైనా సీతక్కని ఓడించాలని ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట BRS అధినేత.
2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించింది బీఆర్‌ఎస్. సీతక్కని కూడా గులాబీ గూటికి చేర్చి BRS కండువా కప్పేందుకు తెరవెనుక చాలా ప్రయత్నాలు జరిగాయంటారు. కానీ అవేమీ ఫలించలేదు. పార్టీ మారేందుకు సీతక్క ససేమిరా అనడంతో ఆమెని టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే టికెట్ ఆశిస్తున్న ఆశావహుల వివరాలను స్వయంగా కేసీఆర్ పరిశీలించారని సమాచారం. ప్రొఫెసర్, డాక్టర్, ఇద్దరు ఉపాధ్యాయులు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్, ఓ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ బయోడేటాలను పరిశీలించారట. అయితే వారెవరూ సీతక్కను ఢీ కొట్టేందుకు సరిపోరని బీఆర్‌ఎస్ అధినేత భావించినట్లు సమాచారం.
సీతక్కని ఓడించడమే లక్ష్యంగా ములుగు నియోజవర్గంలో కేసీఆర్ కొత్త ప్రయోగం చేయబోతున్నారని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ దాన్నే సూచన ప్రాయంగా ప్రకటించారని భావిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు సీతక్క సామాజిక వర్గానికి చెందిన మహిళని, నక్సల్ ఉద్యమంలో సీతక్క కంటే పెద్ద హోదాలో పనిచేసి అమరుడైన మావోయిస్టు నేత కూతురుని బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉందట బీఆర్‌ఎస్. మాజీ మావోయిస్టు బడే నాగేశ్వరరావు కూతురు బడే నాగజ్యోతిని ములుగు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారట.
కేటీఆర్ ములుగు పర్యటనలో పదేపదే నాగజ్యోతి పేరు ప్రస్తావించడం, ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించడం ద్వారా పరోక్షంగా ఆమే అభ్యర్థి అన్న సంకేతాలు ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నాగజ్యోతి ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయి జడ్పీటీసీగా ఉన్నారు. జిల్లా పరిషత్ ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. మంచి మాటకారి కావడం… ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన నాగజ్యోతి మేడారం ప్రాంతం నుంచి జడ్పీటీసీగా ఉండడంతో ఆమెనే అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారానే ప్రచారం జోరందుకుంది.
మరి ములుగులో మాస్‌లీడర్‌గా జనంలోకి చొచ్చుకుపోతున్న సీతక్క స్పీడ్‌కి బీఆర్‌ఎస్ బ్రేక్ వేయగలుగుతుందా.. గులాబీ బాస్ ప్రయోగం ఫలిస్తుందా…ములుగులో గులాబీ జెండా ఎగురుతుందా.. MLA సీతక్కని నాగజ్యోతి ఢీ కొట్టగలుగుతుందా అన్న చర్చ ఏజెన్సీలో మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.