AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ ఆందోళన

తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్‌ ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపగా.. మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. పూర్తి వివరాలు కథనం లోపల ...

Telangana: యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ ఆందోళన
KTR Protest
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2025 | 1:40 PM

Share

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ యూరియాపై ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్‌పార్క్‌కు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తూతూ మంత్రంగా అసెంబ్లీ పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యలపై మాట్లాడే ఆలోచన ప్రభుత్వం చయడం లేదని…కచ్చితంగా 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ తరపున కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

రైతులకు యూరియా అందించాలని నిరసనకు దిగిన బీఆర్ఎస్‌.. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీ వెళ్లారు. అక్కడ అధికారులకు వినతి పత్రం అందించారు. ఆ తరువాత వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తరువాత తెలంగాణ సచివాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. యూరియా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సచివాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులను వారిని అదుపులోకి తీసుకున్నారు.

యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు మాజీమంత్రి హరీష్‌రావు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చాలన్నారు. యూరియా సమస్యను పరిష్కరించాల్సిందేనన్నారు. అప్పటి వరకు అసెంబ్లీని స్తంభింపజేస్తామన్నారు. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని తెలిపారు.

అయితే బీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియాపై బీఆర్ఎస్‌ నేతలది కపట నాటకమని ఆరోపించారు. యూరియా కొరతకు కేంద్రం కారణమని తెలియదా అని మండిపడ్డారు. కేంద్రం వల్ల కొరత ఉంటే తమపై విమర్శలు చేయడం ఎందుకన్నారు. బీఆర్ఎస్‌ నాటకాలను రైతులు నమ్మరన్నారు.