Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు..!

గిరిజనుల నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో మృతుడి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలకు అండగా నిలిచారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు..!
Warangal Brs Dharna
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Oct 26, 2024 | 8:34 PM

రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయని, శాంతిభద్రతలు అదుపుతప్పి నేరాలు, హత్యలు పెరిగి పోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అనుభవంలేని పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా వరంగల్ లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మధుసూధనాచారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాలకుర్తిలో జరిగిన ధర్నాలో హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేతలు. వారం రోజుల క్రితం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను అనే గిరిజనుడు ఆత్మహత్యకు పాల్పడ్దాడు.. శ్రీను మరణ వాంగ్మూలం రాజకీయ దుమారం రేపుతుంది. భార్యాభర్తల పంచాయతీలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు అతన్ని కొట్టారని అందువల్లే శ్రీను చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గిరిజనుడి ఆత్మహత్య నేపథ్యంలో గిరిజన సంఘాలు గత వారం రోజుల నుండి నిరసనలు తెలుపుతున్నారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకొని వారిని ప్రోత్సహించిన అధికార పార్టీ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

గిరిజనుల నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో మృతుడి కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలకు అండగా నిలిచారు. ఈ ధర్నాలో శాసనమండలి పక్ష నేత మధుసూధనచారితో పాటు మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఇతర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు..

పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల సెటిల్మెంట్లకు అడ్డగా మారాయని ఆరోపించారు.. గిరిజనుడు శ్రీను మరణం ప్రభుత్వ హత్యే అని.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన దారి తప్పిందని ఆరోపించారు. శాంతి భద్రతలు రక్షించాల్సిన పోలీసులే రోడ్డెక్కి నిరసన తెలిపే దుస్థితి నెలకొందని కాంగ్రెస్ పాలనలో పోలీసుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలుతుంది ఆరు నెలల్లో BRS అధికారంలోకి రాబోతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో త్వరలో బాంబులు పేలబోతున్నాయన్న ఎర్రబెల్లి, ఆ పార్టీ నాయకులే ప్రభుత్వాన్ని కూల్చడానికి రొడ్డెక్కుతున్నారని మీపై మీరే బాంబులు వేసుకుంటున్నారు. మేం బాంబులు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం కుప్ప కూలడం కాయమని బీఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు.

ఇక, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా శాంతి భద్రతలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు బానిసలు కాకండి.. పోలీస్ డ్రెస్ కు ఉన్న గౌరవాన్ని కాపాడాలని అన్నారు.. రాష్ట్రంలో నేరాలు, హత్యలు పెరిగాయని..రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడో.. లేదో.. తెలియడం లేదన్నారు. వరంగల్ లో CI మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే మూడు రోజులు వరకు కేసు పెట్టకుండా ఆపారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న BRS శాసన మండలి పక్షనేత మధుసూదనా చారి వరంగల్ పోలీస్ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లే కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయని అనుభవంలేని పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.

మరన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..