Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ‘ఈ ఇంచార్జ్‌‌లు మాకొద్దు బాబోయ్..’ మొరపెట్టుకుంటున్న అభ్యర్ధులు.. పార్టీలకు కొత్త తలనొప్పులు..

ఈ ఇంఛార్జ్ మాకొద్దు బాబోయ్ అంటున్నారంట ఆ నియోజకవర్గ అభ్యర్థులు. అదిష్టానానికి, నియోజకవర్గానికి మధ్య సారథిగా ఉంటూ అభ్యర్థి గెలుపుకు బాటలు వేయాల్సింది పోయి అసలుకే ఎసరు తెచ్చేలా చేస్తున్నారంట. గొంతెమ్మ కోర్కెలతో అభ్యర్థులకు చుక్కలు చూపించడమే కాదు కింది స్థాయి నేతలతో దురుసుగా ప్రవర్తిస్తూ మొదటికే మోసం తెస్తున్నారని టాక్. ఎక్కడ వీక్ ఉన్నామో గుర్తించి వార్ రూంకు సమాచారం ఇవ్వాల్సింది పోయి వాళ్లే కొరకరాని కొయ్యగా మారుతున్నారని సమాచారం.

Telangana Elections: 'ఈ ఇంచార్జ్‌‌లు మాకొద్దు బాబోయ్..' మొరపెట్టుకుంటున్న అభ్యర్ధులు.. పార్టీలకు కొత్త తలనొప్పులు..
Brs Party Has Trouble With In Charges In Adilabad District
Follow us
Naresh Gollana

| Edited By: Srikar T

Updated on: Nov 20, 2023 | 4:31 PM

ఈ ఇంఛార్జ్ మాకొద్దు బాబోయ్ అంటున్నారంట ఆ నియోజకవర్గ అభ్యర్థులు. అదిష్టానానికి, నియోజకవర్గానికి మధ్య సారథిగా ఉంటూ అభ్యర్థి గెలుపుకు బాటలు వేయాల్సింది పోయి అసలుకే ఎసరు తెచ్చేలా చేస్తున్నారంట. గొంతెమ్మ కోర్కెలతో అభ్యర్థులకు చుక్కలు చూపించడమే కాదు కింది స్థాయి నేతలతో దురుసుగా ప్రవర్తిస్తూ మొదటికే మోసం తెస్తున్నారని టాక్. ఎక్కడ వీక్ ఉన్నామో గుర్తించి వార్ రూంకు సమాచారం ఇవ్వాల్సింది పోయి వాళ్లే కొరకరాని కొయ్యగా మారుతున్నారని సమాచారం. తీరా అసలు సమస్య గుర్తించి ఇంఛార్జ్‌ను మార్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే ఉందంట అక్కడి పరిస్థితి. ఒక వేళ అభ్యర్థి ఓటమిపాలైతే అది ఇంచార్జ్‌ల కారణంగానే అనే టాక్ ఉమ్మడి ఆదిలాబాద్‌లోని రెండు నియోజకవర్గాల్లో బలంగా రీసౌండ్ వస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఆ రెండు రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌ల తీరు మొదటికే మోసం తెచ్చేలా మార్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ మూడు నియోజకవర్గాల్లో గెలుపు పక్కా చేసుకోవాల్సిన అధికార పార్టీ బీఆర్ఎస్ వెనుకబడే పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓట్ల పండుగకు కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉండగా గెలుపు బాట పట్టాల్సిన ఆ మూడు నియోజక వర్గాల గులాబీ సైన్యం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిందంట. అందుకు కారణం ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా వచ్చి‌న నేతల తీరే అనే టాక్ నడుస్తోంది. ఖానాపూర్, బోథ్, బెల్లంపల్లిలో ఇంఛార్జ్‌ల కారణంగా అభ్యర్థుల గెలుపు ఇరకాటంలో పడిందని బీఆర్ఎస్ నేతలు లోలోపల జోరుగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గం పై పట్టులేని నేతలను ఇంచార్జ్‌లుగా పంపి అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును ఇరకాటంలో పెట్టారనే టాక్ నడుస్తోంది.

ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్ ను‌ కాదని తన మిత్రుడు జాన్సన్ నాయక్‌కు కేటీఆర్ టికెట్ కట్టబెట్టగా.. ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఇంఛార్జ్‌గా ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ ను రంగంలోకి‌ దింపింది బీఆర్ఎస్. అయితే ఆయన రాకతో గెలుపు బాట పట్టాల్సిన బీఆర్ఎస్ పాతాళానికి పడిపోయుదంట. సంక్షేమ పథకాల అమలుతో ఓట్ షేరింగ్‌లో టాప్‌లో ఉండాల్సిన ఖానాపూర్ బీఆర్ఎస్ పోటీలో వెనుకబడిందనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకు కారణం దండె విఠల్ ఒంటెద్దు పోకడలే అని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. కీలక నేతలను లైట్ తీసుకోవడం.. క్యాడర్‌ను‌ చిన్న చూపు చూడటంతో.. నిన్న మొన్నటి వరకు అంతా తామై నిలిచిన నేతలు సైతం ప్రచారంలో అంటి ముంటనట్టుగా ఉండిపోయారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రచారంలో వెనుకబడి ఉన్న ప్రాంతాలను గుర్తించి వార్ రూంకు‌ సమాచారం ఇవ్వాల్సిందిపోయి అధిష్టానాన్నే పక్క దారి‌ పట్టించారని చర్చ జోరుగా సాగుతోంది. దీంతో అలర్ట్ అయిన అధిష్టానం ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా దండె విఠల్‌ను‌ తప్పించి సీనియర్ నేత ఎన్నికల్లో తనదైన శైలిలో చక్రం తిప్పగల నాయకుడు వేణుగోపాల చారికి పగ్గాలు ఇచ్చినా ఖానాపూర్‌లో అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఖానాపూర్ సీట్‌ను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకోవడంతో మండలానికో ఇంచార్జ్‌ను కేటాయించేందుకు అధిష్టానం ఫ్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కడెం మండలం ఇంఛార్జ్‌గా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. జన్నారం మండలాన్ని మరో సీనియర్ నేతకు అప్పగించారని.. ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెళ్లి మండలాలను వేణుగోపాలచారికి అప్పగించినట్లు తెలుస్తోంది. తుది దశ ప్రచారంలో.. మునుగోడు స్టైల్‌లో వ్యూహాలు రచించి ఖానాపూర్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుందంట గులాబీ అదిష్టానం.

ఇక మరో ఎస్టీ నియోజకవర్గం బోథ్‌లోను ఇదే సీన్ రిపీట్ అవుతుందంట. ముందుగా ఈ నియోజకవర్గానికి‌ సైతం దండె విఠల్‌ను ఇంచార్జ్‌గా కేటాయించగా ఆయన వల్ల నష్టం తప్పదని.. ఆయనను‌ తప్పించి మాజీ ఎంపి‌ గెడం నగేష్‌కు బోథ్ బీఆర్ఎస్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆయన సైతం స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అభ్యర్థి గెలుపుకు ఆయన సీనియారిటి.. వ్యూహాలు పాజిటివ్‌గా మారాల్సింది పోయి ప్రత్యర్థి‌పార్టీకి‌ అస్త్రాలు గా మారుతున్నాయంట. అటు సింగరేణి ఖిల్లా ఎస్సీ నియోజకవర్గం బెల్లంపల్లిలోను సేమ్ సీన్ రిపీట్ అవుతోందట. ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి దుర్గం చిన్నయ్య‌ గెలుపుకు బాటలు వేయాల్సింది పోయి దానికి భిన్నంగా పావులు కదుపుతున్నారట. ఇప్పుడు చిన్నయ్యకు చెక్ పెడితే భవిష్యత్‌లో‌ ఈ‌సీటు‌ నాదే అన్న కోణంలో ఎత్తులకు పై ఎత్తులు‌ వేస్తూ ప్రత్యర్థి పార్టీ గెలుపును నల్లేరు మీద నడకలా చేస్తున్నారనే చర్చ గులాబీ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. ఈ గులాబీ పార్టీ ఇంచార్జ్‌ల తప్పటడుగులు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో తెలియాలంటే వేచి చూడక తప్పదు.