AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలోనే రాష్ట్రంలో మరో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్… అక్కడ ఏర్పాటుకు స్థల పరిశీలన

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక రక్షణ రంగ ప్రాజెక్ట్ ఏర్పాటు పై ఆశలు రేకెత్తుతున్నాయి. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరణకు దేవరకద్ర మండలంలో అవకాశాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు, అధికారులు. ఇందుకోసం ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

త్వరలోనే రాష్ట్రంలో మరో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్... అక్కడ ఏర్పాటుకు స్థల పరిశీలన
Brahmos
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 20, 2025 | 12:20 PM

Share

గడచిన కొన్నేళ్లుగా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఈ క్షిపణుల తయారీ యూనిట్ నెలకొల్పబడి ఉంది. దీన్ని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా స్థలాల కోసం అన్వేషణ సాగుతోంది. అయితే ఈ నెల 18న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధులను కోరారు. డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలు అనుకూలమైనవన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు డిఫెన్స్ సంస్థలున్న నేపథ్యంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను సైతం విస్తరించాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

అలా సమావేశం ముగిసి మూడు రోజులు గడవకు ముందే బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. DRDL జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డా, జైతీర్థ్ జోషి, DRDL డైరెక్టర్ డా,జీ.ఏ శ్రీనివాస్ మూర్తి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా, జీ. ఎ.ఎస్ సాంబశివప్రసాద్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చౌదర్ పల్లి, బస్వాయిపల్లి గ్రామ శివారులోని భూముల పరిశీలించారు. వీరికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే జీ మధుసూధన్ రెడ్డి సైతం భూముల పరిశీలనలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్, అనుబంధ సంస్థలకు అనుకూలంగా ఉంటుందని భావించారు. NH 44, NH 167 కు మధ్యలో ఉన్న ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు చెప్పారు.

ఇక తాజా స్థల పరిశీలనతో హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం స్థల పరిశీలన జరిగిన ప్రాంతంలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటు జరిగితే డిఫెన్స్ కారిడార్ కు వేగంగా అడుగులు పడే అవకాశం ఉంది. మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. మిస్సైల్ కు అవసరమయ్యే విడిభాగాలు తయారీకి సంబంధిత MSME పరిశ్రమలు అవసరం ఉంటుంది. దీంతో ఇలాంటి వాటితో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే ఆస్కారం ఉంది.

ఇక బ్రహ్మోస్ క్షిపణిని భారత బ్రహ్మాస్త్ర గా భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువుల యాంటీ మిస్సైల్ సిస్టమ్ లకు దొరక్కుండా దూసుకుపోతాయి. బ్రహ్మోస్ క్షిపణుల్లో నాలుగు రకాలు భారత్ వద్ద ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలం, ఆకాశం నుండి ఉపరితలం, సముద్రం నుండి ఉపరితలం, నీటి అడుగు నుంచి అంటే జలాంతర్గాముల నుంచి ఉపరితలానికి ప్రయోగించగలవి. ఈ బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగం కంటే 2.8 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి