Manuguru: ‘అమ్మా నీకేం కాదు.. నేను ఇక్కడే ఉన్నా’.. కన్నీరు పెట్టించిన బాలుడి ఆవేదన
అమ్మ, నాన్నలను నెత్తుడి మడుగులో చూసి ఆ చిట్టి గుండె తల్లడిల్లిపోయింది. అయినా సరే ఏం కాదంటూ తల్లిదండ్రులకు అతడు ధైర్యం చెప్పడం హృదయాన్ని కదిలించింది.
భుజాలపై మోసి పెంచిన నాన్న ముందు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. విశాలమంత ప్రేమ పంచిన అమ్మ వెనక కూర్చుంది. మధ్యలో 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అమ్మానాన్నలే ఆ బాలుడి సర్వస్వం. మొక్కవోని ధైర్యం. కానీ ఇంతలో ఊహించని ఉపద్రవం. వెనక నుంచి వచ్చిన లారీ బలంగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బాలుడు లేచి చూసే సరికి.. అమ్మ ముఖంపై నుంచి రక్తం దారలుగా కారుతుంది. నాన్న అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ 12 ఏళ్ల బాలుడికి కూడా చిన్నపాటి గాయాలయ్యాయి. అప్పుడు అతడు పడిన ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. “అమ్మా నీకేం కాదు.. నేను ఇక్కడ ఉన్నాగా.. (అక్కడ ఆగినవారిపైపు చూస్తూ) అంకుల్ కాస్త వాటర్ ఉండే ఇస్తారా.. ఏం అనుకోకండి ప్లీజ్ కాస్త.. అమ్మ జుట్టు పైకి అని ముఖంపై బ్లడ్ కాస్త కడగరా”.. అంటూ ఆ బాలుడు తల్లిదండ్రుల కోసం ఆరాటపడిన తీరు కన్నీరు పెట్టించింది.
అమ్మానాన్నలు నెత్తుటి మడుగులో చూసి ఓ వైపు ఆ బాలుడి హృదయం విలవిల్లాడిపోతుంది. అమ్మ వద్దకు వెళ్లి ధైర్యం చెప్పడం.. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న ఛాతిపై ఉన్న రక్తం తుడుస్తూ.. వారికి ధైర్యం చెబుతూ.. గుండెనిబ్బరం ప్రదర్శించాడు. ఆపై వెంటనే బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మణుగూరు మండలం విజయనగరం గ్రామం సమీపంలో శనివారం రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది.
ఘటనలో శివలింగాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ, భార్య, తనయుడితో కలిసి స్కూటీపై కొండాయిగూడెం నుంచి మణుగూరు ట్రావెల్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీ, స్కూటీని క్రాస్ చేయబోయి బలంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో సత్యనారాయణతో పాటు, భార్య లక్ష్మికి తీవ్రంగా గాయపడ్డారు. వారి తనయుడు నవదీప్‌కి కూడా గాయాలయ్యాయి. వీరిని మణుగూరులోని ఓ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఆపై భద్రాచలం తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..