AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమ్మో బొమ్మ.. పసుపు, కుంకుమతో భయం భయం.. అసలేం జరిగిందో వీడియోలో చూడండి..

గ్రామ శివారు.. నిర్మానుష్యమైన రోడ్డు పక్కన ఓ చెట్టు.. కొమ్మలకు తలకిందులుగా వేలాడుతున్న భయంకరమైన బొమ్మలు, వాటికి పసుపు కుంకుమల ఆనవాళ్లు.. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం వెలుగుచూసిన ఈ దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. క్షుద్రపూజలు జరిగాయన్న అనుమానాలు బలపడుతుండటంతో, అటువైపు వెళ్లాలంటేనే జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు.

Telangana: అమ్మో బొమ్మ.. పసుపు, కుంకుమతో భయం భయం.. అసలేం జరిగిందో వీడియోలో చూడండి..
Black Magic Panic In Peddapalli
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 06, 2026 | 10:56 AM

Share

పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల–పెద్దబొంకూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు పలు బొమ్మలను వేలాడదీశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదారు బొమ్మలను చెట్టు కొమ్మలకు కట్టేశారు. వాటికి మహిళల మాదిరిగా అలంకరణ చేసి, గడ్డితో జుట్టును అమర్చి, ఒళ్లంతా పసుపు, కుంకుమ బొట్లు పెట్టారు. దూరం నుంచి చూసినా, దగ్గరికెళ్లి చూసినా అత్యంత భయానకంగా కనిపిస్తుండటంతో అటుగా వెళ్లే బాటసారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఆదివారం నాడే ఈ బొమ్మలను అక్కడ కట్టడంతో.. అర్ధరాత్రి వేళ ఎవరో క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారని గ్రామస్తులు బలంగా అనుమానిస్తున్నారు. చేతబడులు, క్షుద్ర ప్రయోగాల కోసమే ఇలాంటి భయంకరమైన బొమ్మలను తయారు చేసి చెట్లకు వేలాడదీస్తారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఆ ప్రాంతాన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే చెట్టు దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేక రోడ్డుపై నుంచే చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి పోలీసులు.. సీసీ ఫుటేజీల పరిశీలన

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, ఇది ఆకతాయిల పనా లేక నిజంగానే ఎవరైనా మూఢనమ్మకాలతో ఇలా చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నామని తెలిపారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, బొమ్మలు కట్టిన వారిని త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మూఢనమ్మకాలు నమ్మొద్దు

మరోవైపు ఇలాంటి క్షుద్రపూజల పుకార్లను ఎవరూ నమ్మవద్దని జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూఢనమ్మకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని తొలగించేందుకు అవసరమైతే త్వరలోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. అయినప్పటికీ చెట్టుకు వేలాడుతున్న బొమ్మల వ్యవహారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

Follow Us