UNలో జైశంకర్ పవర్‌ఫుల్ స్పీచ్.. ఉగ్రవాదంపై కఠిన హెచ్చరిక, యుద్ధాలపై కీలక వ్యాఖ్యలు!
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ప్రపంచానికి పలు కీలక సందేశాలు ఇచ్చారు. ఉగ్రవాదం, కృత్రిమ మేధ (AI), మధ్యప్రాచ్య సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సవాళ్లు సహా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ప్రపంచానికి పలు కీలక సందేశాలు ఇచ్చారు. ఉగ్రవాదం, కృత్రిమ మేధ (AI), మధ్యప్రాచ్య సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సవాళ్లు సహా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.
ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి
ఉగ్రవాదాన్ని సాధారణీకరించే లేదా దాని పరిణామాల నుంచి తమకు మినహాయింపు ఉందని చెప్పుకునే వాదనలను అంగీకరించబోమని జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రభుత్వాలను జవాబుదారీగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును భారత్ వినియోగించుకుంటుందని, ఉగ్రవాదంపై తన అసహన వైఖరిలో ఎలాంటి వెనుకడుగు ఉండదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం, స్నేహం, సద్భావన ఒకేసారి కొనసాగలేవని స్పష్టం చేస్తూ, ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక వనరులను గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జైశంకర్ స్పష్టం చేశారు.
AIపై భారత్ విధానం
కృత్రిమ మేధపై కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, భారతదేశంలో జరిగిన AI Impact Summitను జైశంకర్ ప్రస్తావించారు. మానవ సాధికారత, ఆర్థిక అభివృద్ధి, భారీ స్థాయి సమస్యలకు పరిష్కారాలను అందించడంలో AI కీలక సాధనంగా మారగలదని అన్నారు. ప్రతి దేశానికి తన జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సొంత AI ఎకోసిస్టమ్, మోడళ్లు, అమలు వ్యూహాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్‌తో భారత భాగస్వామ్యంలో AI కూడా కీలక అంశమని వివరించారు.
యుద్ధాలు, సముద్ర భద్రతపై ఆందోళన
మధ్యప్రాచ్యంలోని సంఘర్షణలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్ర సముద్రం నుంచి నల్ల సముద్రం వరకు వాణిజ్య నౌకలు, నావికులపై దాడులు జరగడం ఆందోళనకరమని జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకలు, నావికుల భద్రతకు భంగం కలగకూడదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ వివాదం ఐదో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని, ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాలు నిరంతరాయంగా ఉండేలా చర్యలు అవసరమని పేర్కొన్నారు.
గ్లోబల్ సౌత్‌కు 4F సవాళ్లు
గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న ‘4F’ సంక్షోభం – Food, Fuel, Fertiliser, Financeపై కూడా కేంద్ర మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. వాతావరణ పరిస్థితులు, ఎరువుల కొరత, ధాన్యం రవాణాకు అడ్డంకులు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. AI దుర్వినియోగం పక్షపాతాన్ని పెంచి పరస్పర గౌరవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. గ్లోబల్ సౌత్ దేశాలకు పారిశ్రామికీకరణకు హక్కు ఉందని స్పష్టం చేస్తూ, ప్రపంచ వ్యవస్థలో మార్కెట్ సంబంధిత అసమానతలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
బహుధ్రువ ప్రపంచం వైపు భారత్ పిలుపు
ప్రపంచం బహుధ్రువ వ్యవస్థ వైపు పయనిస్తోందని జైశంకర్ అన్నారు. 1945 తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థ కొత్త వాస్తవాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులు, పారదర్శక నిర్ణయాలు, నాగరిక సంభాషణ ద్వారా బహుధ్రువ ప్రపంచ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ నిర్ణయాల నుంచి మానవాళిలోని ఒక పెద్ద భాగాన్ని పక్కన పెట్టలేమని స్పష్టం చేసిన జైశంకర్, శాంతి, అభివృద్ధి, ప్రపంచ శ్రేయస్సుపై అంతర్జాతీయ నిబద్ధతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. చివరగా మహాత్మా గాంధీ సందేశాన్ని గుర్తుచేస్తూ..“శాంతికి మార్గం అంటూ ఏదీ లేదు; శాంతే మార్గం”**—అని తన ప్రసంగాన్ని ముగించారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
