Telangana: ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా కార్యాచరణ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కమలం పార్టీ నిర్ణయం..
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. దానికి తగిన కార్యాచరణతో ముందుకెళ్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని బీజేపీ..
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. దానికి తగిన కార్యాచరణతో ముందుకెళ్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పైకి అధికారంలోకి వచ్చేది తామే అని కమలం పార్టీ చెబుతున్నప్పటికి.. కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థతిపై పార్టీ అధినాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో బీజేపీ శిక్షణా తరగతులు జరగుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఈ శిక్షణా తరగతుల్లో చర్చించడంతో పాటు.. అధికార టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని.. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో బీజేపీతో పోలిస్తే క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కార్యకర్తల బలం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం, అంతర్గత పోరుతో ఆ పార్టీ అనుకున్నంత బలంగా ముందుకు వెళ్లలేకపోతుంది. దీనిని అవకాశంగా తీసుకున్న బీజేపీ టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే ఆలోచన ప్రజల్లో కలిగేలా తనవంతు ప్రయత్నం చేస్తోంది. గతంలో త్రిపుర, పశ్చిమబెంగాల్‌లో ఎంతో బలహీనంగా ఉన్న బీజేపీ ప్రస్తుతం బలమైన పార్టీగా మారింది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ అక్కడ బలపడింది. అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నప్పటికి.. అది కమలం పార్టీకి అంత సులభం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినప్పటికి.. కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఇవ్వవచ్చనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కాలంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కమలం పార్టీ పక్కా కార్యాచరణను రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నవారిని తమ వైపు ఆకర్షించే విధంగా బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలకుండా, అధికార టీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొనే పార్టీ తమదేననే ఆలోచన ప్రజల్లో కలిగేలా కాషాయ పార్టీ ముందుకెళ్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని.. కేంద్రప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధుల గురించి ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి సంస్థాగత, నిర్మాణాత్మక కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సహ ప్రధానకార్యదర్శి శివప్రకాశ్ బీజేపీ శిక్షణాతరగతుల్లో శ్రేణులకు సూచించారు. కొత్త, పాత నాయకులు కలిసి పనిచేయాలని హితవు పలికారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీకి అవకాశాలు, ఆర్‌ఎస్ఎస్(సంఘ్) పరివార్‌లోని సంస్థలతో బీజేపీ సమన్వయం, రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు తదితర అంశాలపై శిక్షణా తరగతుల్లో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వేరే ఆలోచన ఏదీ లేకుండా పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని, నాయకులంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అగ్రనాయకులు సూచించారు.
మొత్తం మీద ఎన్నికలకు ఏడాది గడువున్నా.. ఇప్పటినుంచే బీజేపీ ఎన్నికల వ్యూహన్ని రూపొందించి ముందుకెళ్లాలని నిర్ణయించగా, ప్రతిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా తనదైన రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తెలంగాణ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింన టీఆర్‌ఎస్.. ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోంది. ప్రజలు మాత్రం ఎవరివైపు మొగ్గు చూపిస్తారనేది ఎన్నికల సమయంలోనే తెలియనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..