BJP Target: ఎనిమిది సీట్లతో జోష్.. కమలానికి పెరిగిన ఓట్లు.. టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్
తెలంగాణలో కదనోత్సాహంతో ఉంది కమలదళం. అధికారమే తరువాయి అంటూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ టార్గెట్ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకీ ఓట్లు, సీట్లు పెంచుకుంటున్న బీజేపీ.. డబుల్ డిజిట్ కాకపోయినా గతకంటే డబుల్ ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. 8 ఎంపీ స్థానాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇచ్చింది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపడతామన్న ధీమాతో వ్యూహాలకు పదునుపెడుతోంది కాషాయ పార్టీ.

తెలంగాణలో కదనోత్సాహంతో ఉంది కమలదళం. అధికారమే తరువాయి అంటూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ టార్గెట్ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎన్నిక ఎన్నికకీ ఓట్లు, సీట్లు పెంచుకుంటున్న బీజేపీ.. డబుల్ డిజిట్ కాకపోయినా గతకంటే డబుల్ ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. 8 ఎంపీ స్థానాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇచ్చింది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపడతామన్న ధీమాతో వ్యూహాలకు పదునుపెడుతోంది కాషాయ పార్టీ.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అంచనాలకు తగ్గట్లే పర్‌ఫామ్ చేసింది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్‌గా బరిలోకి దిగిన రాష్ట్ర నాయకత్వం ఆ మేజిక్ సాధించలేకపోయినా.. గతంకంటే రెట్టింపు సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా నిరూపించుకుంది. గతంలో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారపార్టీతో సరిసమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో తాము కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచామని, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు తమ చేతికొస్తాయన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది.
పెరిగిన సీట్లతో పాటు ఓట్ల శాతం కమలం శ్రేణుల్లో జోష్ నింపింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు దక్కకపోయినా..ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోరాటపటిమ చూపించి తెలంగాణలో బీజేపీ మరింత పట్టు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 7 శాతం ఓట్లొస్తే ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఏడాదితిరిగేలోపే 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి 19 శాతం ఓటింగ్‌తో ఆ పార్టీ నుంచి ఏకంగా నలుగురు ఎంపీలు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లు సాధించిన బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటింగ్ ఏకంగా 35 శాతానికి పెరిగింది. ఆ పార్టీనుంచి ఎనిమింది ఎంపీలు గెలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గత బీఆర్‌ఎస్ పాలననే తలపిస్తోందని.. హామీల అమలులో ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని కమలం నేతలు టార్గెట్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దక్షిణాదిపై ఫోకస్ పెట్టడంతో.. కేంద్రంలో కొలువుదీరనున్న ఎన్డీయే సర్కారులో రాష్ట్ర బీజేపీ ఎంపీలకు రెండు మూడు కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
గత బీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంది బీజేపీ. అయితే ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు గెలవకలేపోయినా .. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గట్టి ప్రభావమే చూపింది. ఈ ఫలితాలతో రానున్న కాలం తమదేనని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న నమ్మకంతో ఉంద బీజేపీ నాయకత్వం. అధికార పగ్గాలు చేపట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని ఇప్పటినుంచే ధీమా వ్యక్తంచేస్తున్నారు కమలనాథులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
