Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. కరెంట్ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay Slams TRS Govt: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే
Bandi Sanjay Slams TRS Govt: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల (Electricity Bill) పెంపుతో మోయలేని భారాన్ని మోపి పేదల నడ్డి విరుస్తోందంటూ సంజయ్ విరుచుకుపడ్డారు. కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బండి సంజయ్ గురువారం ప్రకటన విడుదల చేశారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీఆర్ ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవం దారుణమన్నారు. అలాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా.. అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ. 12,598 కోట్లు ఉన్నాయన్నారు. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 4603 కోట్లు కాగా.. అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్ కు బిల్లులు చెల్లించడం లేదు.. మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదు.. కానీ ఈ లోటును పూడ్చుకునేందుకు సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు సమంజసం అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు తగ్గించేవరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. పేదల నుంచి మధ్య తరగతి వరకు ఎవరినీ వదలకుండా ఛార్జీల పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు షాక్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ బండి సంజయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: