Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: తగ్గేదెలె.. టార్గెట్‌ 90.. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌తో దూకుడు.. సంక్రాంతి తర్వాతే ముహూర్తం.. గెలుపు గుర్రాల కోసం వేట..

ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు..! 4 అంచెల వ్యవస్థతో దూసుకెళ్లాలంటూ రోడ్‌మ్యాప్‌ అందించారు. ఇంతకీ ఏంటా 4 అంచెల వ్యవస్థ..? ఆ 45 నియోజకవర్గాల్లో ఏం చేయబోతున్నారు?

BJP: తగ్గేదెలె.. టార్గెట్‌ 90.. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌తో దూకుడు.. సంక్రాంతి తర్వాతే ముహూర్తం.. గెలుపు గుర్రాల కోసం వేట..
Telangana BJP Mission-90
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 30, 2022 | 1:50 PM

నిన్నటి శామీర్‌పేట సమావేశంలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇకపై జనంలోనే జనంతోనే ఉండేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించారు కమలనాథులు. పాలక్‌లు, ప్రభారీలు, కన్వీనర్లు, విస్తారక్‌లు ఇలా మొత్తం 4 అంచెల వ్యవస్థను సిద్ధం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతను 4 సీనియర్లకు అప్పగించారు. 119 నియోజకవర్గాలకు పాలక్‌లను ప్రకటించారు. అంటే.. ప్రతి రోజు.. ప్రతిగ్రామం..ప్రతి పోలింగ్‌బూత్, ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేశారు..! 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. ఏకంగా 90 సీట్లు గెల్చుకోవాలంటూ.. మిషన్‌ 90ని రెడీ చేశారు. 45 నియోజక వర్గాల్లో పార్టీ వీక్‌గా ఉంది. వాటిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించింది BJP. ఢిల్లీ నుంచి వచ్చిన హైకమాండ్ పెద్దలు కీలక సూచనలు చేశారు. బల‌హీన‌మైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. పార్టీ బ‌ల‌హీనంగా ఉండి బ‌ల‌మైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వివ‌రాలు ఇప్పటికే రెడీ చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాలు, ప్రణాళిక‌లు, ప్రత్యర్థి పార్టీల బ‌ల‌హీన‌త‌లు, విధాన ప‌ర‌మైన హామీల్లాంటి అంశాలతో డిటైల్డ్ రిపోర్ట్ రూపొందించారు.

త్వరలోనే పెద్ద ఎత్తున పోలింగ్‌ బూత్ సమ్మేళనం నిర్వహించడం ద్వారా ఎన్నికల శంఖారావం పూరించాలని భావిస్తోంది. బీజేపీ చేరికల కమిటీ కూడా దూకుడు పెంచింది. బలమైన లీడర్స్ కోసం వేట మొదలుపెట్టింది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఇప్పటికే లిస్ట్‌ ఔట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతోంది కాంగ్రెస్.

ఇదిలావుంటే బాధ్యతలను కేటాయించారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలను 119 నియోజకవర్గాల్లో పాలక్‌లుగా నియమించారు. శేరిలింగంపల్లికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మేడ్చల్‌కు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కుత్బుల్లాపూర్‌–డీకే అరుణ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ –నల్లు ఇంద్రసేనారెడ్డి, పటాన్‌చెరు–మురళీధర్‌రావు, వరంగల్‌ తూర్పు– ఈటల రాజేందర్, మెదక్‌–ధర్మపురి అర్వింద్, చేవెళ్ల–ఏపీ జితేందర్‌రెడ్డి, జుక్కల్‌–జి.వివేక్‌ వెంకటస్వామి, నకిరేకల్‌–ఎ.చంద్రశేఖర్,

కొల్లాపూర్‌–పేరాల శేఖర్‌రావు, నల్లగొండ–గరికపాటి మోహన్‌రావు, పాలకుర్తి–బూరనర్సయ్యగౌడ్, ఎల్లారెడ్డి–రఘునందన్‌రావు, జూబ్లీహిల్స్‌–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌–కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పరిగి–విజయశాంతి, ములుగు–సోయం బాపురావు, వైరా–ఎం.రవీంద్రనాయక్, ఎల్లారెడ్డి–గూడూరు నారాయణరెడ్డి, మహేశ్వరం–పొంగులేటి సుధాకరరెడ్డి, మునుగోడు–చాడ సురేశ్‌రెడ్డి, రాజేంద్రనగర్‌–మర్రి శశిధర్‌రెడ్డి, కల్వకుర్తికి ఎన్‌.రామచంద్రరావులను పాలక్‌లుగా నియమించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పర్యవేక్షణ కోసం ప్రభారీ, కన్వీనర్లను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నియమించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం